ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంటిముందు కారు బాంబు నిలిపిన కేసు దర్యాప్తులో వేగం పెంచారు ఎన్ఐఏ అధికారులు. ఈ కేసులో మరో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న సందర్భంగా ఈ ఇరువురి పేర్లు వెలుగులోకి వచ్చినట్లుగా సంబంధిత అధికారులు తెలిపారు. . జూన్ 11న మలాద్ సబర్బన్ నుంచి సంతోష్ షెలార్, ఆనంద్ జాదవ్‌లను అరెస్ట్ చేయడం జరిగింది. అంబానీ ఇంటి ముందు కారు బాంబు నిలపడం వెనుక జరిగిన కుట్రలో ఈ ఇద్దరి ప్రమేయం కూడా ఉన్నట్టు ప్రాథమిక విచారణలో తేలిందని వారు తెలిపారు.
ప్రత్యేక కోర్టు ఈ ఇద్దరినీ జూన్ 21 వరకు NIA కస్టడీకి అప్పగించిందని NIA అధికారి వెల్లడించారు. మరోవైపు థానేకి చెందిన వ్యాపారవేత్త, కారుబాంబు కోసం వినియోగించిన SUV కారు యజమాని మన్సుఖ్ హీరేన్ హత్య వెనుక షెలార్, జాదవ్ పాత్ర ఉందా… అనే కోణంలోనూ NIA దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే డిస్మిస్ అయిన ముంబై పోలీస్ అధికారి సచిన్ వాజే ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.
థానేకి చెందిన వ్యాపారవేత్త మన్‌సుఖ్ హిరేన్ హత్యలో వీరిద్దరికి గల పాత్రను నిర్ధారించేందుకు ఎన్‌ఐఎ ప్రయత్నిస్తోందని చెప్పారు. పేలుడు పదార్ధాలు ఉంచిన వాహనం యజమాని హిరేన్ మార్చి 5న థానేలో అనుమానస్పద రీతిలో చనిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ కేసులో నలుగురు పోలీసులను, క్రికెట్ బుకీని అరెస్టు చేశారు.