Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahabubnagar: మాయదారి వ్యసనం ఎంత పని చేసింది.. కల్లుకు బానిసై ఆ ఇల్లాలు ఏం చేసిందంటే?

నాడు కట్టుకున్న భర్తను కిరాతకంగా చంపింది. నేడు కడుపున పుట్టిన బిడ్డను కడతేర్చింది. ఆ ఇంట్లో ఐదు నెలల వ్యవధిలో రెండు మార్లు చావు కేకలు వినిపించాయి. ఆలిగా ఇంటిని సరిదిద్దాల్సిన ఆమె హంతకురాలిగా మారి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తోంది. కల్లు మత్తులో కట్టుకున్న భర్తను, కన్న బిడ్డను తిరిగి రాని లోకాలకు పంపింది. మిగిలిన ఇద్దరి సంతానాన్ని సైతం చంపుతానని పిచ్చిగా ప్రవర్తిస్తోంది.

Mahabubnagar: మాయదారి వ్యసనం ఎంత పని చేసింది.. కల్లుకు బానిసై ఆ ఇల్లాలు ఏం చేసిందంటే?
Mbnr
Follow us
Boorugu Shiva Kumar

| Edited By: Anand T

Updated on: May 21, 2025 | 7:35 PM

నాగర్ కర్నూల్ జిల్లా లింగాల్ మండలం చెన్నంపల్లి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఐదు మాసాల వ్యవధిలో తాళి కట్టిన భర్తను, పేగు తెంచుకొని పుట్టిన బిడ్డను హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ముగ్గురు పిల్లల సంతానంతో కలకలాడుతున్న మేకల రాములు కుటుంబం అల్లకల్లోలంగా మారిపోయింది. కుటుంబంలో భర్త, బిడ్డ హత్యతో మిగిలిన ఇద్దరి చిన్నారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వివరాల్లోకి వెళితే.. చెన్నంపల్లి గ్రామానికి చెందిన రాములు గొర్లకాపరిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రాములు కు భార్య ఎల్లమ్మ, ముగ్గురు పిల్లలు సంతానం ఉన్నారు. అందులో ఇద్దరు ఆడపిల్లలు కాగా, ఒక ఏడాది వయసు గల బాబు ఉన్నాడు. గతంలో భర్తతో కలిసే భార్య సైతం గొర్లు కాచేందుకు వెళ్ళేది. అప్పుడప్పుడు గ్రామంలో కూలీ పని సైతం చేసేది. ఎలా, ఎక్కడ అలవాటు అయ్యిందో తెలియదు కానీ కల్లు మహమ్మారి ఎల్లమ్మ జీవితాన్ని, కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. కల్లు మత్తులో భర్త, పిల్లలతో తరచూ గొడవలు పెట్టుకునేది.

ఈ క్రమంలో ఐదు నెలల క్రితం భర్త రాములుతో గొడవపడి నిద్రలో ఉండగానే శాశ్వతనిద్రలోకి పంపింది భార్య ఎల్లమ్మ. తరచూ గొడవల అంశాన్ని మనసులో పెట్టుకొని అర్దరాత్రి భర్తపై రోకలిబండతో దాడి చేసింది. ఘటన అనంతరం కేసు నమోదు చేసి భార్య ఎల్లమ్మను జైలుకు పంపించారు పోలీసులు. అయితే రెండు నెలల క్రితం బెయిల్ పై వచ్చి మళ్ళీ ఎప్పటి లాగే జీవనం కొనసాగిస్తూ వస్తోంది ఎల్లమ్మ. ముగ్గురు పిల్లలతో కలిసి చెన్నంపల్లిలోనే ఇంట్లోనే నివసిస్తోంది.

అయితే ముగ్గురు పిల్లలతో ఎల్లమ్మ కూలీ పని చేసుకుంటూ సాఫీగా జీవనం సాగిస్తున్నదని కుటుంబ సభ్యులు, బంధువులు భావించారు. కానీ మళ్లీ కల్లుకు బానిసైన ఎల్లమ్మ గత రాత్రి మళ్ళీ ఇంట్లో విషాదానికి కారణమయ్యింది. తండ్రిని నువ్వే చంపావని అన్నందుకు రెండో కుమార్తెను గొంతు నులిమి హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని నీటి సంపులో పడేసింది. తెల్లవారు జామున గమనించిన కుటుంబ సభ్యులు సంపు నుంచి మృతదేహాన్ని బయటకు తీసి.. విషయాన్ని పోలీసులకు తెలిపారు. కల్లు మత్తులో భర్తను చంపినట్లుగానే బిడ్డను కూడా కడతేర్చినట్టు ఎల్లమ్మ ఒప్పుకుందని బంధువులు తెలిపారు.

భర్తను చంపి జైలుకు వెళ్లి వచ్చిన మాసాల వ్యవధిలోనే మరో ఘాతుకానికి పాల్పడడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. తండ్రి, తోడబుట్టిన అక్క మరణం, తల్లి మళ్ళీ జైలుకు వెళ్లడంతో మిగిలిన ఇద్దరి చిన్నారుల పరిస్థితి ఆగమయ్యగోచరంగా మారింది. ఇప్పుడు ఆ ఇద్దరి చిన్నారుల పరిస్థితి తలుచుకుంటే కన్నీళ్లు తన్నుకొస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..