Actor Balakrishna PA Arrest: ప్రముఖ సినీ నటుడు, హిందూపురం(Hindupur) టీడీపీ(TDP) ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత సహాయకుడు బాలాజీ(Balaji)ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రా కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులోని నగరిగేర వద్ద పేకాట ఆడుతూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. పక్కా సమాచారంతో పేకాట ఆడుతున్న స్థావరాలపై కర్ణాటక స్పెషల్ టాస్క్‌పోర్స్ పోలీసులు దాడులు చేశారు.. దీంతో హిందూపురానికి చెందిన 19 మంది పేకాటరాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారిలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏ బాలాజీతో పాటు హిందూపూరం మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ శ్రీరామ్ రెడ్డి, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా ఉన్నట్లు గౌరిబిదనూర్ పోలీసులు తెలిపారు. పట్టుబడిన వారి నుంచి లక్షా 50వేల రూపాయలు స్వాధీనం చేస్తున్నారు. నిందితులను అరెస్ట్ చేసి కర్ణాటకలోని చిక్బల్లాపూర్ జిల్లా గుడిబండ కోర్టులో పోలీసులు హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు.
కాగా, తన ప్రత్యర్థి పార్టీ వైసీపీలోని కీలక నేతలతో నందమూరి బాలయ్య పీఏ పేకాట ఆడుతూ పట్టుబడటం ఇప్పుడు హిందూపురంలో హాట్‌టాఫిక్‌గా మారింది. ఓ వైపు నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు తమ ప్రత్యర్థులైన వైసీపీ నాయకులతో క్షేత్రస్థాయిలో పోరాడుతుంటే.. ఏకంగా ఎమ్మెల్యే బాలయ్య పీఏ మాత్రం అధికార పార్టీ నేతలతో కలిసి పేకాట ఆడతూ.. పట్టుబడటం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ క్రమంలో పీఏ విషయంలో బాలయ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదీ ఆసక్తికరంగా మారింది.
బాలయ్య హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి బాలాజీ పీఏగా వ్యవహరిస్తున్నారు. గత ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా బాలయ్యకు అధికారిక పీఏగా బాలాజీ వ్యవహరిస్తున్నారు. బాలయ్య ప్రోగ్రామ్స్‌తో పాటు హిందూపురంలో ఆయన రాజకీయ వ్యవహారాలను బాలజీనే దగ్గరుండి చూసుకుంటారు. అంతటి కీలకమైన స్థానంలో ఉన్న పీఏ బాలాజీ వైఖరి ప్రస్తుతం బాలయ్యకు తలనొప్పిగా మారింది.గతంలో కూడా బాలయ్యకు ప్రైవేట్ పీఏగా ఉన్న శేఖర్ వ్యవహార శైలి వల్ల అనేక సమస్యలు వచ్చాయి. అప్పట్లో పీఏ శేఖర్‌పై అనేక ఆరోపణలు రావడం, పార్టీ కేడర్ కూడా తీవ్రంగా వ్యతిరేకించడంతో అప్పట్లో ఆయన్ను హిందూపురం నుంచి పంపేశారు. తాజాగా పీఏ బాలాజీ వ్యవహారంపై కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై నందమూరి బాలయ్య ఎలా స్పందిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.
Read Also…. Mukesh Ambani: అంబానీ చేతికి మరో కంపెనీ.. డీల్ వ్యాల్యూ ఎంతంటే..