Tiger Roaming Villages : ఇప్పటివరకు అడవిలో మేతకు వెళ్లిన పశువులపై దాడిచేస్తున్న పులులు తాజాగా గ్రామంలోకి చొరబడి ఓ ఎద్దును చంపడం కుమురం భీం జిల్లాలోని అటవీ ప్రాంత ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. పెంచికల్‌పేట్ మండలం గుండెపల్లి గ్రామంలో పోశయ్య అనే రైతు ఇంటి ముందు కట్టేసిన ఎద్దుపై పులి దాడి చేసింది. దాని ఆర్తనాదాలతో మేల్కొన్న యజమాని టార్చిలైటు వేసిచూస్తుండగానే అది ఆయనవైపు దూసుకొచ్చింది. భయంతో కేకలు వేయడంతో అడవిలోకి పారిపోయింది.
నాలుగు నెలలుగా తప్పించుకు తిరుగుతున్న ఏ-2 పెద్దపులి తెలంగాణలో ఇప్పటికే 34 పశువులను చంపింది. ఇద్దరు మనుషులనూ పొట్టనబెట్టుకుంది. నెలక్రితం వరకూ బెజ్జూర్ మండలం కందిభీమన్న అటవీ ప్రాంతంలో సంచరించింది. దాన్ని బంధించేందుకు అటవీశాఖ రంగంలోకి దిగింది. ప్రత్యేక బృందాలు ఈ ప్రక్రియను జనవరి 11 నుంచి 18 వరకు కొనసాగించాయి. ఈ ప్రయత్నాలు కొనసాగుతుండగానే అది ప్రాణహిత నదిని దాటి మహారాష్ట్ర వైపు వెళ్లడంతో ఈ ఆపరేషన్ ఆగింది. జనవరి 24 నుంచి తెలంగాణ అటవీప్రాంత పరిధిలోనే మరో పులి సంచరిస్తోంది. జనావాసాల్లోకి వస్తూ తరచూ పశువులపై దాడిచేస్తుండటంతో అది ఏ-2 పెద్దపులేనని బాధిత గ్రామస్థులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా పులి సంచారంతో పెంచికల్‌పేట్, బెజ్జూర్, దహెగాం మండలాల్లోని 35 గ్రామాల ప్రజలు పొలం పనులకు వెళ్లేందుకూ జంకుతున్నారు.