Peacocks dead in Chittoor district: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కలికిరి మండలంలో ఐదు నెమళ్లు మృతి చెందాయి. ఈ నెమళ్లు విషాహారం తిని మృతిచెందినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలోని నర్రవాండ్లపల్లి సమీపంలోని రాగిమాను కుంట వద్ద నెమళ్లు మృతి చెంది ఉండటాన్ని స్థానికులు బుధవారం గుర్తించారు. అనంతరం వాలంటీరు రెడ్డి ప్రసాద్ అటవీశాఖ అధికారి ప్రతాప్‌కు సమాచారం తెలియజేశారు. దీంతో వాల్మీకిపురం అటవీశాఖ సెక్షన్ అధికారి సుధాకర్, స్థానిక పశువైద్య శాల ఏడీ సునీత సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతి చెంది ఉన్న నెమళ్ల మృతదేహాలను పరిశీలించారు. అనంతరం కలికిరి రెడ్డివారిపల్లిలోని పశు వైద్యశాలకు నెమళ్ల కళేబరాలను తరలించారు. ఆ తర్వాత స్థానిక సర్పంచ్ ప్రతాప్ కుమార్ రెడ్డి, గ్రామస్తుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు.
అనంతరం నెమళ్ల అవశేషాలను తిరుపతిలోని పశువైద్యశాల ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. నెమళ్ల కళేబరాలపై జాతీయ జెండాను కప్పి నివాళులర్పించారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే తిరుపతి నుంచి వచ్చే పోస్టుమార్టం నివేదిక తర్వాత నెమళ్ల మృతిపై మరిన్ని వివరాలు తెలుస్తాయని అటవీశాఖ అధికారి తెలిపారు. అటవీ జంతువులను వేటాడటం నేరమని.. అలాంటి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అటవీశాఖ అధికారులు వెల్లడించారు.
Also Read: