Girl Killed By Leopard: ఓ నాలుగేళ్ల చిన్నారిని చిరుత పులి బలితీసుకుంది. ఈ విషాద సంఘటన జమ్మూకాశ్మీర్ లోని బుద్గాం జిల్లాలో చోటుచేసుకుంది. ఓంపొరా హౌసింగ్ కాలనీలోని ఇంటి నుంచి అధా షకీల్ అనే నాలుగేళ్ల బాలిక గురువారం సాయంత్రం తప్పిపోయింది. దీంతో బాలిక కోసం కుటుంబసభ్యులు గాలించారు అయినప్పటికీ.. కనిపించలేదు. శుక్రవారం బాలిక కోసం సమీపంలోని అటవీ ప్రాంతంలో గాలించగా మృతదేహం కనిపించినట్లు పోలీసులు వెల్లడించారు. చిరుతపులి దాడి ఘటనలో బాలిక మృతిచెందిందని అటవీ అధికారులు నిర్ధారించారు. దీంతో షకీల్ కుటుంబసభ్యలు కన్నీరుమున్నీరవుతున్నారు. సాయంత్రం వేళ ఆటుకుంటున్న షకీల్ అకస్మాత్తుగా కనిపించకుండా పోయిందంటూ రోదిస్తున్నారు.
ఇదిలాఉంటే.. ఓంపొరా అటవీ ప్రాంతం పరిధిలో ఇలాటి దాడులను నియంత్రించేందుకు డిప్యూటీ కమిషనర్ షాబాజ్ మీర్జా, సీనియర్ పోలీసులు, అటవీ, వన్యప్రాణి విభాగాల అధికారులు సమావేశమయ్యారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దీనికోసం పలు ప్రణాళికలను రూపొందించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతోపాటు అటవీ ప్రాంతం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు ఓ ప్రణాళికను సైతం ఉన్నతాధికారులకు పంపించారు. అంతేకాకుండా నివాసప్రాంతాల్లో చిరుత పులులు, అదేవిధంగా మృగాల సంచారం లేకుండా చూసేందుకు వన్యప్రాణి వార్డెన్లను నియమించాలని నిర్ణయించారు. ఈ ఘటనతో ఓంపురా ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.
Also Read: