Hyderabad Crime News: హైదరాబాద్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. నగర పరిధిలోని రాజేంద్రనగర్‌లో ముగ్గురు వ్యక్తులు.. మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కలకలం రేపింది. ఫురానాపూల్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ (30) రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్‌గూడకు బుధవారం సాయంత్రం వచ్చింది. ఈ క్రమంలో స్థానికంగా ఉండే ఓ కల్లు దుకాణంలోకి కల్లు తాగేందుకు వెళ్లింది. అయితే.. ఆమెపై కన్నేసిన ఓ ఆటో డ్రైవర్.. సదరు మహిళతో పరిచయం ఏర్పరచుకున్నాడు. అనంతరం మాయమాటలతో ఆమెను ఇంటి దగ్గర దించుతానంటూ బాధితురాలిని నమ్మించాడు. ఆటోడ్రైవర్ మాటలు నమ్మిన.. మహిళ చివరకు అతని ఆటో ఎక్కింది. ఈ తరుణంలో మరో ఇద్దరు వ్యక్తులు కూడా అదే ఆటో ఎక్కారు. అక్కడి నుంచి బాధిత మహిళను హిమాయత్‌సాగర్ సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అనంతరం ముగ్గురు వ్యక్తులు కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ముగ్గురు నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
అనంతరం మత్తు నుంచి కోలుకున్న బాధితురాలు గురువారం ఉదయం స్థానికుల సహకారంతో రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై ప్రత్యేక బృందాలను సైతం ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు రాజేంద్రనగర్ సీఐ కనకయ్య తెలిపారు. సైదాబాద్ ఘటన మరువకముందే.. హైదరాబాద్‌లో మరో ఘటన వెలుగులోకి రావడం సంచలనంగా మారింది.
Also Read: