AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇవాళ ఉన్నాం, రేపు ఉండకపోవచ్చు.. కంటతడి పెట్టిస్తున్న అమర జవాన్ వాట్సాప్ చాట్

వీరమరణం చెందడానికి ఒక రోజు ముందు తన మిత్రుడితో మాట్లాడుతూ ‘ఇవాళ ఉన్నాం.. రేపు ఉండకపోవచ్చు’ అని రాసిన ఆ అమర జవాన్ వాట్సాప్ చాట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇవాళ ఉన్నాం, రేపు ఉండకపోవచ్చు.. కంటతడి పెట్టిస్తున్న అమర జవాన్ వాట్సాప్ చాట్
Umakanth Rao
|

Updated on: Nov 27, 2020 | 10:03 PM

Share

కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో అమరుడైన ఓ జవాన్ వాట్సాప్ చాట్ కంటతడి పెట్టిస్తోంది. వీరమరణం చెందడానికి ఒక రోజు ముందు తన మిత్రుడితో మాట్లాడుతూ ‘ఇవాళ ఉన్నాం.. రేపు ఉండకపోవచ్చు’ అని రాసిన ఆ అమర జవాన్ వాట్సాప్ చాట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

స్నేహితుడితో చాట్ చేస్తూ అన్న మాటలే జవాన్ జీవితంలో తెల్లారేసరికి నిజమయ్యాయి. ఇవాళ ఉన్నాం.. రేపు ఉండకపోవచ్చన్న జవాన్ మాటలు నిజమైన సమస్త భారతావని దిగ్భాంతికి గురైయ్యేలా చేశాయి. మహారాష్ట్రలోని జల్‌గావ్ జిల్లా చలిగావ్ గ్రామానికి చెందిన యశ్ దిగంబర్ దేశ్‌ముఖ్ వయసు 20 ఏళ్లు. ఇండియన్ ఆర్మీకి ఎంపికై దేశానికి సేవలు అందించాలని చిన్ననాటి నుంచే కలలు కన్నారు. ఏడాది కిందట కర్ణాటకలో జరిగిన ఓ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో ఉత్తమ ప్రదర్శన కనబరిచి తన కల సాకారం చేసుకున్నారు. శిక్షణ అనంతరం జమ్మూ కశ్మీర్‌కు పంపించగా.. అక్కడ సమస్యాత్మక ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు.

స్నేహితుడితో చాట్…

ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న జవాన్ యశ్ దేశ్‌ముఖ్ క్షేమ సమాచారాన్ని తెలుసుకునేందుకు మిత్రుడొకరు నవంబర్ 25 వాట్సాప్ ద్వారా చాట్ చేశాడు. ఎలా ఉన్నావ్ అని అడిగాడు. అందుకు జవాన్ స్పందిస్తూ.. ‘నేను బాగానే ఉన్నా.. కానీ, మా (సైనికుల) గురించి మీకు తెలియంది ఏముంది? ఇవాళ ఉంటాం.. రేపు ఉండకపోవచ్చు’ అని బదులిచ్చారు. ఆ మరుసటి రోజే ఉగ్రవాదులు చేసిన దాడిలో వీరమరణం చెందారు. తన మాతృభాష మరాఠీలో చేసిన ఆ చాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. పలువురిని కంటతడి పెట్టిస్తోంది.

అమర జవాన్ యశ్ దేశ్‌ముఖ్‌ ఓ పేద కుటుంబంలో పుట్టారు. ఆయన తండ్రి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. యశ్‌కు తల్లీ, తండ్రితో పాటు ఇద్దరు అక్కలు, ఓ తమ్ముడు ఉన్నారు. అక్కలిద్దరికీ పెళ్లైంది. తమ్ముడు ఇంకా స్కూలుకు వెళ్తున్నాడు.

అసలేం జరిగింది?

జవాన్ యశ్ దేశ్‌ముఖ్ తన సహచరులతో కలిసి గురువారం శ్రీనగర్‌లో ఓ చోట విధులు నిర్వహిస్తున్నారు. ఇంతలో అకస్మాత్తుగా వచ్చిన ముగ్గురు ఉగ్రవాదులు జవాన్లపైకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు కుప్పకూలారు. హాస్పిటల్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. అమరులైన ఇద్దరు జవాన్లలో యశ్ దేశ్‌ముఖ్ (20) ఒకరు. పన్నెండేళ్ల కిందట ఇదే రోజున (26/11) ముంబైలో ఉగ్రవాదులు దాడులకు తెగబడి 166 మందిని పొట్టనపెట్టుకున్నారు. దేశం ఆ విషాద ఘటనను గుర్తుచేసుకుంటుండగా.. తాజా దాడి జరిగింది. ఈ దాడిలో మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు కశ్మీర్ ఐజీ తెలిపారు. వారిలో ఇద్దరు పాకిస్థాన్‌కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారు కాగా.. మరొకడిని స్థానికుడిగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఉగ్రవాదులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.