కరోనా కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు పోతోందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యాపేటలో జరిగిన ఓ కార్యక్రమం అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ఈ మేరకు వ్యాఖ్యానించారు. కరోనాపై కేంద్రం, ఐసీఎమ్మార్ నిబంధనలకు అనుగుణంగానే తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలు దేశంలో ఎవరూ తీసుకోలేదన్నారు. ఐసిఎంఆర్ సూచనల మేరకు పరీక్షలు, చికిత్సలు సాగుతున్నాయని వెల్లడించారు.
రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రులను కోవిడ్ ఆస్పత్రులగా మార్చి బాధితులకు చికిత్సలు చేస్తున్నామని, అలాగే ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లకు కూడా అనుమతులు ఇచ్చామని తెలిపారు. లాక్‌డౌన్ తర్వాత కరోనా కేసులు పెరుగుతామని అందరూ ఊహిస్తున్న విషయమేనని… ఒక్క తెలంగాణలోనే కాదు.. దేశవ్యాప్తంగా వైరస్ విజృంభణ కొనసాగుతుందన్నారు. వైరస్ తీవ్రత ఎక్కువగా ముంబై, చెన్నై, ఢిల్లీ నగరాలలో కనిపిస్తోందన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు.
ప్రతిపక్షాలు అర్థం లేకుండా విమర్శలు చేస్తున్నాయని జగదీష్ రెడ్ది మండిపడ్డారు. ఏ రాష్ట్రంలో కోవిడ్ లేదో చెప్పాలన్నారు. ప్రతిపక్షాలు పసలేని ఆరోపణలు చేస్తున్నాయని మంత్రి కొట్టి పారేశారు. కరోనాను కట్టడి చేసేందుకు తీసుకుంటున్న చర్యల కారణంగా మరణాల రేటు తగ్గిందన్నారు. కరోనా వ్యాక్సిన్ వస్తే తప్ప పూర్తిస్థాయిలో వైరస్ ను అరికట్టలేమని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.