Omicron: వేగంగా విస్తరిస్తున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. అక్కడ ప్రతి 10మందిలో ఒకరికి కరోనా!

UK Omicron: కరోనా మహమ్మారి విజృంభణతో బ్రిటన్ అల్లాడిపోతోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగుచూసిన దగ్గరి నుంచి రికార్డు స్థాయిలో కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

Omicron: వేగంగా విస్తరిస్తున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. అక్కడ ప్రతి 10మందిలో ఒకరికి కరోనా!
Uk Corona Csses

Updated on: Dec 25, 2021 | 4:31 PM

UK record for Covid Omicron cases: కరోనా మహమ్మారి విజృంభణతో బ్రిటన్ అల్లాడిపోతోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగుచూసిన దగ్గరి నుంచి రికార్డు స్థాయిలో కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అక్కడ వరుసగా మూడోరోజు లక్షకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో నమోదైన కేసుల సంఖ్య 1,22,186కి చేరింది. మరీ ముఖ్యంగా బ్రిటన్‌ రాజధాని లండన్‌లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్(ఓఎన్‌ఎస్‌) అంచనాల ప్రకారం.. డిసెంబర్ 16 నాటికి రాజధాని నగరంలో ప్రతి 20 మందిలో ఒకరు కొవిడ్ బారినపడి ఉండొచ్చని తెలిపింది. అలాగే ఆదివారం నాటికి ప్రతి పది మందిలో ఒకరు కొవిడ్ బారిన పడే అవకాశం ఉండొచ్చని ముందస్తు అంచనాలను వెల్లడించింది.

గత మూడు విడతల్లో కరోనా వైరస్ సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. అయితే, గత వేరియంట్ల కంటే ఒమిక్రాన్‌తో ఆసుపత్రిలో చేరే ప్రమాదం తక్కువగా ఉందని ఇటీవల ఓ అధ్యయనం వెల్లడించింది. అయితే అక్కడి వైద్యులు మాత్రం పూర్తిస్థాయి సమాచారం అందుబాటులో లేనందున పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నట్లు చెప్తున్నారు. ఇక, ఆ దేశంలో శుక్రవారం 137 మంది ప్రాణాలు కోల్పోయారు. ముందురోజు కంటే మరణాలు తగ్గాయి. ఇప్పటి వరకు బ్రిటన్ వ్యాప్తంగా మొత్తం 1,47,857 మంది మరణించారు. ఇది ఐరోపాలోనే అత్యధికం కావడం గమనార్హం.

యూకే మొత్తంలో స్కాట్లాండ్‌లోనే ఇన్ఫెక్షన్‌ రేటు తక్కువగా ఉన్నట్లు ఓఎన్‌ఎస్‌ వెల్లడించింది. డిసెంబర్ 19 నాటికి అక్కడ ప్రతి 65 మందిలో ఒకరికి కరోనా సోకినట్లు తెలిపింది. ఇంగ్లండ్‌లో ప్రతి 35 మందిలో ఒకరికి ఈ వైరస్ సోకి ఉంటుందని అంచనా వేసింది. ఆదివారం నాటికి ఆ పరిస్థితి 25 మందిలో ఒకరు స్థాయికి చేరనుందని పేర్కొంది. మరోపక్క కొవిడ్ కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు స్వీయ నిర్బంధంలోకి వెళ్తుండటంతో..పరిశ్రమలు, రవాణా సంస్థలు సిబ్బంది కొరతతో సతమతం అవుతున్నాయి. కాగా, ONS అంచనాల ప్రకారం ఇంగ్లాండ్‌లోని 35 మందిలో 1 మంది – 1.54 మిలియన్ల మందికి సమానం – డిసెంబర్ 19 నుండి ఆరు రోజులలో కోవిడ్-19 బారిన పడ్డారు. ఆదివారం నాటికి 2 మిలియన్ల కంటే ఎక్కువ మంది లేదా 25లో 1 మందికి పెరిగే అవకాశం ఉందని సూచించింది.

Read Also… CJI NV Ramana: స్వగ్రామం పొన్నవరంలో CJI ఎన్వీరమణకు ఘనసత్కారం.. విజయవాడలో సీజేఐతో సీఎం జగన్ భేటీ