ఎంసెట్, ఇతర ప్రవేశ పరీక్షలు వాయిదా..తిరిగి ఎప్పుడంటే..

|

Apr 13, 2020 | 12:16 PM

తెలంగాణ‌లో ఎంసెట్‌, స‌హా ఇత‌ర ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌న్నీ వాయిదా ప‌డ్డాయి. ఈ మేర‌కు రాష్ట్ర ఉన్న‌త విద్యామండ‌లి ప్ర‌క‌టించింది. ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ తో సహా ఉమ్మడి ప్రవేశ పరీక్షలన్నింటినీ వాయిదా వేస్తున్నట్లు స్ప‌ష్టం చేసింది. దీంతో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను మరో నెల ముందుకు జరిపి,ఈ ప‌రీక్షలను జూన్‌ నెలలో నిర్వహించే యోచ‌న‌లో ఉంది. కరోనా అంతకంతకూ ప్రబలుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఈ నెల 30తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.   వాస్తవానికి […]

ఎంసెట్, ఇతర ప్రవేశ పరీక్షలు వాయిదా..తిరిగి ఎప్పుడంటే..
Follow us on

తెలంగాణ‌లో ఎంసెట్‌, స‌హా ఇత‌ర ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌న్నీ వాయిదా ప‌డ్డాయి. ఈ మేర‌కు రాష్ట్ర ఉన్న‌త విద్యామండ‌లి ప్ర‌క‌టించింది. ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ తో సహా ఉమ్మడి ప్రవేశ పరీక్షలన్నింటినీ వాయిదా వేస్తున్నట్లు స్ప‌ష్టం చేసింది. దీంతో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను మరో నెల ముందుకు జరిపి,ఈ ప‌రీక్షలను జూన్‌ నెలలో నిర్వహించే యోచ‌న‌లో ఉంది. కరోనా అంతకంతకూ ప్రబలుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఈ నెల 30తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.

 

వాస్తవానికి మే నెలలో ఎంసెట్‌తోపాటు అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షలను నిర్వహించి ఫలితాలు ప్రకటించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. అకస్మాత్తుగా కరోనా వచ్చిపడడంతో ఈ పరీక్షలు వాయిదా పడుతూ వచ్చాయి. తాజాగా లాక్‌డౌన్‌ను పొడగించడంతో ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న గడువును మే 5తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి అధ్యక్షులు పాపిరెడ్డి  ప్రకటించారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం మే 4 నుంచి మూడు రోజులపాటు ఎంసెట్‌ను, తొమ్మిదో తేదీ నుంచి మూడు రోజులపాటు అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశ పరీక్షను నిర్వహించాల్సి ఉంది. దీంతోపాటు ఈసెట్‌ను మే 2న , పీజీఈసెట్‌ను మే 28 నుంచి 31తేదీ వరకు, ఐసెట్‌ను మే 20, 21 తేదీల్లో, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టెస్టును మే 13న, లాసెట్‌, పీజీ లాసెట్‌ను మే 27న ,ఎడ్‌సెట్‌ను మే 23న నిర్వహించాలని ఉన్నత విద్యామండలి తేదీలను ఖరారు చేసి విద్యార్థుల నుంచి దరఖాస్తులను కూడా స్వీకరించింది. మే 2 నుంచి 31 తేదీల మధ్య ఈ ప్రవేశ పరీక్షలు జరగాల్సి ఉంది. కరోనా, లాక్‌డౌన్‌ కారణంతో ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన ప్రవేశ పరీక్షలు మరోసారి వాయిదా వేస్తున్నట్లు మండలి ప్రకటించింది.

 

మే చివరి వారంలో నీట్‌ను నిర్వహిస్తామని భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. జేఈఈ మెయిన్స్‌ కూడా మే మూడో వారంలో నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఈ రెండు జాతీయ పరీక్షలు పూర్తయ్యాకే రాష్ట్రస్థాయిలో జరిగే ఎంసెట్‌ వంటి ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. జాతీయ స్థాయి పరీక్షలతోపాటు పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు నిర్వహించే ప్రవేశ పరీక్షల తేదీలను దృష్టిలో ఉంచుకుని ఎంసెట్‌ను నిర్వహించాల్సి ఉంటుందని, ఇందుకు సంబందించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నామని అధికారులు చెబుతున్నారు. ప్రవేశ పరీక్షలు నిర్వహించకుండా ఏమీ చేయలేమని, పరిస్థితులను బట్టి, ప్రభుత్వం ఇచ్చే సూచనల ప్రకారం ముందుకు వెళతామని మండలి అధికారులు పేర్కొన్నారు.