క‌రోనా ఘంటికః తెలంగాణ‌లో 36కు చేరిన పాజిటివ్ కేసులు

|

Mar 24, 2020 | 2:30 PM

రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 36కు చేరుకుంది. తాజాగా మరో ముగ్గురిలో కరోనా లక్షణాలు గుర్తించారు. వీరు కూడా విదేశాల నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు...

క‌రోనా ఘంటికః తెలంగాణ‌లో 36కు చేరిన పాజిటివ్ కేసులు
Follow us on

రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 36కు చేరుకుంది. తాజాగా మరో ముగ్గురిలో కరోనా లక్షణాలు గుర్తించారు. వీరు కూడా విదేశాల నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు.

తెలంగాణ‌లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంగ‌ళ‌వారం మధ్యామ్నం ధ్రువీకరించింది. కొత్త‌గా న‌మోదైన మూడు కేసులో ఒక‌రు రంగారెడ్డి జిల్లా కోకాపేట‌కు చెందిన వ్య‌క్తిగా గుర్తించారు. అత‌డికి సుమారుగా 49ఏళ్ల వ‌య‌సున్న‌ట్లుగా నిర్ధారించారు. కొద్ది రోజుల క్రిత‌మే ఇత‌డు లండన్ నుంచి తెలంగాణకు వచ్చినట్లుగా గుర్తించారు. కాగా, ప్రస్తుతం అత‌డి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వివరించారు.

ఇక మ‌రోక‌రు…హైదరాబాద్‌లోని చందానగర్‌కు చెందిన మహిళకు క‌రోనా వైర‌స్ పాజిటివ్‌గా వ‌చ్చిన‌ట్లుగా వైద్యాధికారులు వెల్ల‌డించారు. ఈమె వయసు 39 ఏళ్లు కాగా, ఈమె ఇటీవల‌ జర్మనీ నుంచి వచ్చినట్లుగా గుర్తించారు. మరో వ్యక్తి బేగంపేటకు చెందిన 61 ఏళ్ల వృద్ధురాలు. ఈమె సౌదీ అరేబియా నుంచి ఇటీవలే నగరానికి వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లుగా అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో క‌రోనావైర‌స్ పంజా విసురుతోంది. మార్చి 23న‌ ఒక్క రోజే ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో కేసుల సంఖ్య 33కు చేరింది. తాజాగా మరో ముగ్గురికి కరోనా పాజిటివ్ అని తేలడంతో మొత్తం కరోనా సంఖ్య 36కు చేరింది.

ఇప్ప‌టికే శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 70 వేల‌కు పైగా ప్ర‌యాణికుల‌కు థ‌ర్మ‌ల్ స్క్రినింగ్ టెస్టులు నిర్వ‌హించారు. ఆరోగ్య శాఖ సూచ‌న‌ల మేర‌కు 868 మంది ఇంట్లోనే ఐసోలేష‌న్‌లో ఉంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా వైర‌స్ ల‌క్ష‌ణాల‌తో 850 మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఇటు గాంధీలో 402 మందికి టెస్టులు నిర్వ‌హించారు. ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చిన 412 మందికి టెస్టులు చేయ‌గా, గాంధీ ఫీవ‌ర్ ఆస్ప‌త్రి ఐసోలేషన్‌లో 400 మంది ఉన్న‌ట్లుగా అధికారులు వెల్ల‌డించారు. మ‌రో 1,165 మందిని ఐసోలేషన్ , కోరంటీన్ సెంటర్లలో పెట్టామ‌ని, మ‌రో 11వేల మందిని తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో ఉంచిన‌ట్లుగా వైద్య ఆరోగ్య‌శాఖ అధికారులు వెల్ల‌డించారు.

రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులపై ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ మేర‌కు ఇవాళ సాయంత్రం సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించ‌నున్న‌ట్లు స‌మాచారం.