దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కలకలం రేపుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 50,998 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 228 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,01,161కి చేరింది. కొత్తగా కరోనా కారణంగా ఒకరు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం బులిటెన్ విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 1653కి చేరింది.
తాజాగా మహమ్మారి బారి నుంచి నిన్న 152 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,97,515కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,993 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 795 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 46 కేసులు వెలుగుచూశాయి. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా టెస్టుల సంఖ్య 92,00,465కి చేరింది.
మరోవైపు తెలంగాణలో పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కరోనా నిబంధనలను పాటిస్తూ అధికారులు పోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. అయితే హైదరాబాద్ శివార్లలోని పలు పోలింగ్ సెంటర్లలో ఓటు వేసేందుకు వచ్చిన వారికి కచ్చితంగా కోవిడ్ టెస్టులు చేస్తున్నారు. మదీనగూడ, శేరిలింగంపల్లి, హఫీజ్‌పేట్ పరిధిలోని పలు కేంద్రాల్లో ఈ రకమైన టెస్టులు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన తమకు ఉన్నతాధికారుల ఆదేశాలు అందాయాని ఆయా సెంటర్లలోని వైద్య సిబ్బంది తెలిపారు. ఓటు వేసేందుకు వచ్చిన సిబ్బందికి కచ్చితంగా కరోనా టెస్టులు.. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని వెల్లడించారు.
కాగా కరోనా కేసులు మరోసారి ప్రమాదకరంగా పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి అని చెబుతున్నారు.
Also Read: Summer Food: సమ్మర్ వచ్చేసింది.. శరీరాన్ని కూల్‌గా ఉంచుకోవాలంటే వీటిని తినాల్సిందే..