Police Corona: పోలీసులపై కరోనా పంజా.. గ్రేటర్ పరిధిలో 72 మందికి పాజిటివ్!
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 72మంది పోలీసులు కొవిడ్ బాధితులయ్యారు.
Telangana Police Coronavirus: తెలంగాణలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈసారి అన్ని వర్గాల వారిని వదలడం లేదు. ముఖ్యంగా ఫ్రంట్‌లైన్ వారియర్స్ సైతం రాకాసి బారినపడుతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ లో కరోనా కలకలం రేపింది. పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న 20 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో కరోనా సోకిన పోలీసులు హోం ఐసోలేషన్ ఉంటూ చికిత్సపొందుతున్నట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు, పోలీస్ స్టేషన్ లోకి ఎవ్వరినీ అనుమతించవద్దని ఉన్నత అధికారులు సూచించారు. మరోవైపు, ఫిర్యాదుదారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కంప్లైంట్ చేసే వారికోసం ప్రత్యేక టెంట్ ఏర్పాటు చేశారు అధికారులు. మాస్క్ లేకుండా ఎవ్వరినీ అనుమతించమని తెలిపిన పోలీసులు.. సామాజిక దూరాన్ని పాటించాలని చెబుతున్నారు. మరోవైపు, శాంతిభద్రతల కోసం శ్రమించే వీరంతా ఇప్పుడు కొవిడ్ బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ఇదిలావుంటే, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 72మంది పోలీసులు కొవిడ్ బాధితులయ్యారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో సీఐతో పాటు 14 మంది కానిస్టేబుళ్లకు పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం అందరూ హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అటు, హైదరాబాద్ సీసీఎస్, సైబర్ క్రైమ్‌లో పనిచేస్తున్న 20 మంది పోలీస్ సిబ్బందికి కరోనా సోకింది. ఇటీవల సైబర్ క్రైమ్ టీమ్ ఓ కేసు విషయంలో రాజస్థాన్‌కి వెళ్లి వచ్చారు. ఆ టీమ్‌లోని ఎస్సైకి కరోనా పాజిటివ్ వచ్చింది. ఎస్సై నుంచి అందరికీ సోకినట్లు అనుమానిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన 20 మంది పోలీసు సిబ్బంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.
ఇదిలా ఉండగా.. చైతన్యపురి పీఎస్‌లో 8 మంది కానిస్టేబుళ్లు, వనస్థలిపురంలో ఒకరు, అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఒకరికి కరోనా సోకింది. అల్వాల్ పోలీస్‌స్టేషన్‌లో నలుగురు సిబ్బంది కొవిడ్ బారిన పడినట్లు అధికారులు తెలిపారు. ప్రజలంతా మాస్కులు ధరించి.. కొవిడ్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.
Read Also…. AP Corona Cases: ఏపీలో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు.. ఆ 2 జిల్లాల్లో వైరస్ కల్లోలం
TSRTC Income: ఈ సంక్రాంతి టీఎస్ ఆర్టీసీకి బాగా కలిసొచ్చింది.. ఎంత ఆదాయం వచ్చిందో తెలుసా!