Coronavirus: ఒమిక్రాన్‌పై ఆందోళన అవసరం లేదు.. ఇంటి నుంచే సాధారణ చికిత్స తీసుకుంటే బయటపడవచ్చు: దక్షిణఫ్రికా మెడికల్‌ అసోసియేషన్‌ ఛైర్‌పర్సన్‌

|

Jan 07, 2022 | 7:46 PM

సుమారు రెండేళ్ల క్రితం చైనాలోని వుహాన్‌ వేదికగా పురుడు పోసుకుంది కరోనా మహమ్మారి. అప్పటి నుంచి ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తూనే ఉంది. కొత్త కొత్త వేరియంట్ల రూపంలో తన ఉనికిని మార్చుకుంటూ అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది

Coronavirus: ఒమిక్రాన్‌పై ఆందోళన అవసరం లేదు.. ఇంటి నుంచే సాధారణ చికిత్స తీసుకుంటే బయటపడవచ్చు: దక్షిణఫ్రికా మెడికల్‌ అసోసియేషన్‌ ఛైర్‌పర్సన్‌
Dr. Angelique Coetzee
Follow us on

సుమారు రెండేళ్ల క్రితం చైనాలోని వుహాన్‌ వేదికగా పురుడు పోసుకుంది కరోనా మహమ్మారి. అప్పటి నుంచి ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తూనే ఉంది. కొత్త కొత్త వేరియంట్ల రూపంలో తన ఉనికిని మార్చుకుంటూ అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. అలా ఇప్పుడు ప్రపంచమంతా ఒమిక్రాన్‌ గురించి తెగ ఆందోళన చెందుతోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ కొత్త వేరియంట్ దడ పుట్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ వైరస్‌ బారిన పడుతుండగా.. అమెరికా, ఇంగ్లండ్‌, ఇజ్రాయెల్‌, ఇండియా.. తదితర దేశాల్లో మరణాలు కూడా సంభవించాయి. ఇలా ఒమిక్రాన్ పేరు వింటనే భయాందోళనలు పెరుగుతున్న పరిస్థితుల్లో ఒమిక్రాన్ అంటే ఏమాత్రం భయపడాల్సిన పనిలేదంటున్నారు సౌతాఫ్రికాకు చెందిన ప్రముఖ వైద్యురాలు ఏంజెలిక్ కోయెట్జీ. ఈ వైరస్‌ సోకినా ఇంటి నుంచి సాధారణ చికిత్సతోనే బయటపడవచ్చని భరోసా ఇస్తున్నారు. అన్నట్లు ఈమె ఎవరో కాదు.. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ను మొట్టమొదటిగా గుర్తించింది ఈ వైద్యురాలే. ప్రస్తుతం దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తోన్న ఆమె ఈ కొత్త వేరియంట్‌ వ్యాప్తి, ప్రభావం, చికిత్స తదితర విషయాలపై స్పందించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

వారికి మాత్రమే ఆక్సిజన్‌ అవసరమైంది..
‘మా దేశంలో ఒమిక్రాన్ బారిన పడిన చాలామంది సాధారణ..సులభమైన చికిత్సతో కోలుకుంటున్నారు. ఒమిక్రాన్ బాధితుల్లో చాలా తేలికపాటి లక్షణాలే ఉన్నాయి. ఒమిక్రాన్ బాధితుల్లో కొంతమందికి ఎక్కువగా ఒళ్లు నొప్పులు, తలనొప్పి, అలసట వంటి లక్షణాలే కనిపించాయి. మరికొంతమందిలో పొడి దగ్గు, గొంతు గరగరలు వంటి లక్షణాలు కనిపించాయి. అయితే రోగ నిర్ధారణ జరిగిన వెంటనే.. చికిత్స ప్రారంభిస్తే వెంటనే ఒమిక్రాన్‌ నుంచి కోలుకోవచ్చు. చికిత్సలో భాగంగా తక్కువ మోతాదులో కార్టిసోన్, ఐబూ ప్రొఫెన్ వంటి ఔషధాలను అందించాం. ఇవి తప్ప మరే మెడిసిన్స్ ఒమిక్రాన్ బాధితులకు అందించలేదు. అయినా వారు కోలుకున్నారు. ఆఖరుకు ఆక్సిజన్ గానీ..యాంటీబయాటిక్స్ కూడా అవసరం రాలేదు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 666 ఆస్పత్రుల్లో 1,294 మంది ఒమిక్రాన్‌ బాధితులకు మాత్రమే ఆక్సిజన్ అవసరమైంది. 309 మంది మాత్రమే వెంటిలేటర్లపై చికిత్స తీసుకున్నారు. మొత్తంమీద ఈ వేరియంట్‌ కారణంగా 8, 857 మంది ఆస్పత్రుల్లో చేరారు. ఇందులో ఎక్కువమంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారే’

ఎక్కువ ప్రభావం ఎవరిపై అంటే..
‘ఇక్కడ అందరూ ఒక విషయం తెలుసుకోవాలి. ఒమిక్రాన్‌ డెల్టా వేరియంట్‌ కంటే తేలికపాటిది. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ బాధితుల్లో చాలా తక్కువ మందికి మాత్రమే ఐసీయూ చికిత్స అందించాల్సివచ్చింది. చాలామంది సాధారణ..సులభమైన చికిత్సతో కోలుకుంటున్నారని కోలుకుంటున్నారు. అయితే టీకా తీసుకోనివారి విషయంలో మాత్రం ఇది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. సౌతాఫ్రికాకు చెందిన ఒమిక్రాన్‌ బాధితుల్లో ఎక్కువ మంది టీకా తీసుకోనివారే. అయితే వ్యాక్సిన్‌ ఒక్క డోసు తీసుకున్నవారిలో కూడా ఈ వేరియంట్‌ లక్షణాలు కనిపించాయి. కానీ అవి అతి స్వల్పంగా మాత్రమే ఉన్నాయి. కాబట్టి వ్యాక్సిన్ వేయించుకుంటే సాధ్యమైనంతవరకు ఒమిక్రాన్‌ నుంచి రక్షణ పొందవచ్చు. ఇక మధుమేహం, అధిక రక్తపోటు ఉన్న 50 ఏళ్లు పైబడిన రోగులు జాగ్రత్తగా ఉండడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే వైరస్‌ సోకిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో చాలామంది న్యుమోనియా బారిన పడుతున్నారు. ఇది క్రమంగా ప్రాణాపాయానికి దారి తీస్తోంది.

భారత్‌పై ప్రభావం ఎలా ఉండనుందంటే..
వ్యాక్సిన్ల నిల్వకు సంబంధించి ఆఫ్రికా లాంటి దేశాల్లో కొన్ని సమస్యలున్నాయి. రిఫ్రిజిరేటర్లు ఉన్న చోట మాత్రమే ఈ టీకాలను చాలాకాలం పాటు నిల్వచేయవచ్చు. కానీ మౌలిక సదుపాయాల కొరత కారణంగా ఆఫ్రికాలోని చాలా ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సంక్లిష్టంగా మారింది. కానీ భారత్‌లో వైద్య, ఆరోగ్య మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయి. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా చురుగ్గా సాగుతోంది. టీకాలు ఎంతమందికి అందిచారన్న విషయంపైనే ఒమిక్రాన్‌ ప్రభావం ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. వ్యాక్సిన్ విలువను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి. అదేవిధంగా వైరస్‌ మన మధ్యన ఉన్నా, లేకున్నా ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. భౌతిక దూరం పాటించాలి.

బూస్టర్‌ డోస్‌ రక్షణ నిచ్చినా..
దక్షిణాఫ్రికాతో పాటు చాలా పేద దేశాల్లో టీకాల నిల్వకు సరైన మౌలిక సదుపాయాలు లేవు. కాబట్టి టీకా కంపెనీలు ట్యాబ్లెట్ రూపంలో వ్యాక్సిన్‌లను తయారు చేయడం ప్రారంభించాలి. దీని వల్ల పేద దేశాలకు ప్రయోజనం చేకూరుతుంది. ఇక బూస్టర్‌ డోస్‌ విషయానికొస్తే.. కరోనా కొత్త వేరియంట్ల నుంచి ఇది ఎంతవరకు రక్షణ కలిగిస్తుందో ఇప్పుడే చెప్పలేం. కాబట్టి ఇప్పుడు మనకు స్వీయరక్షణే శ్రీరామరక్ష. ఎన్ని టీకాలు వచ్చినా కొద్దికాలంపాటు మనం ఈ వైరస్‌లతో సహజీవనం చేయాల్సిందే. మాస్క్‌లను మన జీవితంలో భాగం చేసుకోవాల్సిందే’ అని ఏంజెలిక్ కోయెట్జీ చెప్పుకొచ్చారు.

Also read:

Hyderabad: ముంబయి డ్రగ్స్‌ ముఠాల గుట్టు రట్టు చేసిన టాస్క్‌ఫోర్క్‌ పోలీసులు.. పలువురు అరెస్ట్‌.. భారీ మొత్తంలో మత్తు పదార్థాల స్వాధీనం..

Delhi: జైలు అధికారులను చూసి మొబైల్‌ ఫోన్‌ను మింగేసిన ఖైదీ.. ఆపై ఏం జరిగిందంటే..

Tamilnadu: జ్యోతిష్కుడిని నమ్మి కూతురును కడతేర్చిన తల్లి.. ఆపై ఏం జరిగిందంటే..