Shri Saibaba Sansthan Trust: మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. నిత్యం 50వేలకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం కఠిన ఆంక్షలను విధిస్తోంది. ఇప్పటికే పలుచోట్ల లాక్డౌన్ విధించింది. దీంతోపాటు రాష్ట్రం అంతటా నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలోని ప్రఖ్యాత షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సోమవారం రాత్రి 8 గంటల నుంచి మూసి వేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంతవరకూ ఆలయాన్ని మూసే ఉంచనున్నట్లు శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని సాయిబాబా ఆలయంతో పాటు, ప్రసాదాలయం, భక్తి నివాస్‌ను కూడా మూసేస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం పాక్షిక లాక్‌డౌన్‌ను విధించింది. కావున ఈ నిర్ణయం తీసుకున్నట్లు షిర్డీ సాయి ఆలయ నిర్వాహకులు వెల్లడించారు.
మహారాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. గతేడాది దేశవ్యాప్త లాక్‌డౌన్ సమయంలో విధించినటువంటి ఆంక్షలనే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అణలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ ఆదివారం నిర్ణయించింది. ఏప్రిల్ 30 వరకూ ఈ కఠిన ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. దీంతోపాటు వారాంతపు లాక్‌డౌన్లు, 144 సెక్షన్ అమల్లోకి తెస్తున్నారు. రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకూ సరైన కారణాలు లేకుండా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదు. కర్ఫ్యూ నిబంధనల నుంచి నిత్యవసర సేవలను మాత్రం మినహాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా.. రాష్ట్రంలో నిత్యం 50 వేలకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. దీంతోపాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. కరోనా కేసులు, మరణాల పరంగా.. మహారాష్ట్ర దేశంలో మొదటి స్థానంలో కొనసాగుతోంది.
Also Read: