మద్యం మత్తులో దారుణాలు..!
లాక్‌డౌన్ సడలింపు, మద్యం అమ్మకాలతో ఏపీలో పలుచోట్ల నేర సంఘటనలు........

లాక్‌డౌన్ సడలింపు, మద్యం అమ్మకాలతో ఏపీలో పలుచోట్ల నేర సంఘటనలు చోటు చేసుకున్నాయి. మద్యం అతిగా సేవించి వెళుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో మరణించిన సంఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. మద్యం అమ్మకాలు ప్రారంభించిన తొలి రోజునే ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. మైలవరం గ్రామానికి చెందిన వ్యక్తి మద్యం అతిగా సేవించి ఇంటికి తిరిగి వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మరణించారు.
అటు చిత్తూరు జిల్లాలోనూ విషాద సంఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో భార్య, కూతురిపై భర్తే దాడిచేయగా జీవితంపై విరక్తిచెంది భార్య, కూతురు వారి ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పెంకులకిట్టన్నమిషన్ వీధిలో నివాసం ఉంటున్న వ్యక్తి పట్టపగలే ఫూటుగా తాగేసి ఇంటికి వచ్చారు. దీంతో భార్య, భర్తల మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో భార్య, కూతురిపై తాగుబోగు చేయిచేసుకొన్నాడు. దీంతో మనస్తాపానికి గురైన భార్య, కుమార్తె ఇద్దరూ ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు.
ఇదిలా ఉంటే, నెల్లూరు జిల్లాలో ఓ తాగుబోతు మొగుడు భార్యపై దాడి చేశాడు. తప్పతాగి ఇంటికి చేరుకున్న అతగాడు..భార్యా పిల్లలను చితకబాదాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పటంతో ..నన్నే బెదిరిస్తావా అంటూ మరింత రెచ్చిపోయి చితకబాదాడు. పిల్లలతో పాటు భార్యను ఇంట్లోకి బయటకు గెంటేశాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో చోటు చేసుకుంది.
మొత్తానికి లాక్‌డౌన్ తర్వాత తిరిగి మొదలైన మద్యం అమ్మకాలతో పలుచోట్ల నేరాలు, దారుణాలు చోటు చేసుకున్నాయని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి.