Post Covid Symptoms: గత ఐదు నెలల్లో కేరళలో 4గురు చిన్నారులు చనిపోయారు. రెండు నెలలుగా కేరళలో కొవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. వీటికి తోడు MIS-C కొత్త ఆందోళనగా మారింది. పిల్లలకు ఎంఐఎస్-సి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం కోరాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తల్లిదండ్రులను కోరారు. ఇది చికిత్స చేయదగిన వ్యాధి కానీ నిర్లక్ష్యం చేస్తే అది సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించారు.
కరోనా వైరస్ నుంచి కోలుకున్న మూడు నుంచి నాలుగు వారాల తర్వాత పిల్లలలో జ్వరం, కడుపు నొప్పి, ఎర్రటి కళ్ళు, వికారం లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇవి MIS-C కి దారి తీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. కేరళ ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. ఇప్పటి వరకు రాష్ట్రంలో 10 శాతం మంది పిల్లలు కోవిడ్ -19 బారిన పడ్డారు. వీరందరు18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలుగా గుర్తించారు. ఇందులో MIS-C సోకిన కేసులలో ఎక్కువ భాగం 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలే. తిరువనంతపురంలోని ప్రభుత్వ యాజమాన్యంలోని SAT ఆసుపత్రిలో ఈ సంవత్సరం మొదటి MIS-C కేసు నమోదైంది. అయితే ప్రజారోగ్య నిపుణులు గత సంవత్సరం కూడా ఇలాంటి కేసులు నమోదయ్యాయని, ఇప్పడు వాటి తీవ్రత పెరిగిందని తెలిపారు.
నిపుణుల ప్రకారం.. ఇది పిల్లలను ప్రభావితం చేసే అరుదైన సమస్య. కొన్ని సందర్భాల్లో కొవిడ్ నుంచి కోలుకున్నాక కూడా కొంతమంది పిల్లలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. చాలా సందర్భాల్లో లక్షణాలు తరువాతి దశలో కనిపిస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో సరిగ్గా చికిత్స చేయకపోతే అది తీవ్రమైన సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. అయితే ఈ వ్యాధి చికిత్స కోసం ప్రస్తుతానికి ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్, స్టెరాయిడ్లను వాడుతున్నారు. గత ఆరు నెలల్లో కర్ణాటకలో 29, తమిళనాడులో 14 MIS-C కేసులు నమోదయ్యాయని వైద్య నిపుణులు తెలిపారు.