ఇటీవల చోటుచేసుకున్న విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి గ్యాస్ లీకేజీ పేరు వింటేనే ప్రజలు వణికిపోతున్నారు. తాజాగా.. తూర్పుగోదావరి జిల్లాలోని సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెంలో మరోసారి గ్యాస్ లీక్ అయ్యింది. ఓఎన్జీసీ బావి పైపులైన్ నుంచి వచ్చే సహజ వాయువు స్వల్పంగా లీకైంది. నివాసగృహాలకు సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది గమనించిన స్థానికులు భయంతో పరుగులు తీశారు.
స్థానికులు వెంటనే ఓఎన్జీసీ, రెవెన్యూ, పోలీసు అధికారులకు సమాచారం అందించారు. అధికారులు అక్కడికి చేరుకుని బావి నుంచి గ్యాస్ ఉత్పత్తి కాకుండా నిలిపివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గత నెలలోనూ ఇదే ప్రాంతంలో రెండు సార్లు గ్యాసు లీకైందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.