First CORONA Case Recorded: డేంజర్ బెల్స్ మోగింది సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు… మాయదారి కరోనా వైరస్ జాడ తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూసింది. విదేశాల నుంచి రాష్ట్రానికి చేరుకున్న ఓ యువకుడికి వైరస్ సోకినట్టు మొదట గుర్తించారు. అప్పటి నుంచి కరోనా ప్రజలను గడగడలాడించింది. నాలుగు గోడల మధ్యకు పరిమితం చేసింది. సమాజ జీవులను కాస్త ఏకాంత జీవులను మార్చేసింది. వేరే వారితో మాట్లాడాలన్న భయం.. అంతా దారుణంగా మారిపోయింది. జీవితాలను తలకిందులు చేసి ఆడుకుంది. తుమ్మినా, దగ్గినా వెన్నులో వణుకు.. సొంతవారు, ఆప్తులనైనా ప్రేమగా దగ్గరికి చేరి పలకరించలేని పరిస్థితి.. చివరకు కాటికి కూడా అనాథలా తరలిపోవాల్సి న దీనస్థితి.. ఇవీ మానవాళికి కరోనా రక్కసి మిగిల్చిన మరకలు.
ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్ … తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చి సరిగ్గా ఏడాది గడిచింది. ఇదే రోజు ఓ యువకుడికి వైరస్ సోకడం… రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆరోజు మొదలు.. కోవిడ్ వైరస్ రాష్ట్రంలో ప్రతిమూలకు వెళ్లింది. చిన్నా పెద్దా.., ముసలి ముతకా అనే తేడాలేం లేకుండా అందరినీ పీడించింది. ఉన్నోళ్లు.. లేనోళ్లు అని తేడాల లేకుండా అందిరిని కుదేలుచేసింది.
తొలి కేసు రాష్ట్రంలో వెలుగు చూసింది అనగానే సర్కార్ చర్యలు మొదలుపెట్టింది. విమాన రాకపోకలు నిలిపేసింది. ఉమ్మడి కరీంనగర్‌లో ఢిల్లీ మర్కస్ నుంచి వచ్చిన వాళ్లలో వెలుగుచూసింది. కంటైన్‌మెంట్‌లు ఏర్పాటు చేశారు. జులై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో అత్యధికంగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సెప్టెంబర్‌లో అత్యధికంగా సగటున 9.96 మంది మృతి చెందారు.
ఇక ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నాటికి రాష్ట్రంలో మొత్తం 87,21,026 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా… అందులో 2,98,923 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. అందులో ఇప్పటికే 2, 95, 387 మంది కోలుకోగా.. మరో 1,634 మంది మృతి చెందారు. ఫిబ్రవరి 28 నాటికి రాష్ట్రంలో 1,902 మంది యాక్టివ్ కేసులు ఉండగా.. అందులో 804 మంది హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు.
దేశంలోనే మొదటిసారి
కరోనా మహమ్మారి కేసుల పెరుగుదలను గుర్తించిన సర్కారు… దేశంలోనే ముందస్తుగా లాక్‌డౌన్‌ను ప్రకటించింది. విస్త్రృత స్థాయిలో కంటైన్‌మెంట్ జోన్లను ఏర్పాటుచేయటంతోపాటు.. ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు నిత్యావసర సరకులను అందించింది. గాంధీ ఆస్పత్రిని పూర్తిగా కోవిడ్ చికిత్స కేంద్రంగా మార్చారు. దీంతోపాటు పడకల సామర్థ్యాన్ని, ల్యాబుల్లో సౌకర్యాలను, ఆక్సిజన్ సరఫరాతోపాటు అన్ని రకాల సామర్థ్యాలను పెంపొందించుకుంది.
కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు ఏకైక మార్గం… ముందస్తు జాగ్రత్తలే అంటూ.. ప్రజలకు అవగాహన కల్పించిన ఆరోగ్య శాఖ.. మాస్కులు, శానిటైజర్ల వినియోగాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టింది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే… మన దగ్గర కరోనా వ్యాప్తి తక్కువగానే ఉంటూ వచ్చింది. మహమ్మారిపై పోరు చేస్తున్న తరుణంలోనే తెలంగాణ గడ్డమీద టీకా ఆవిష్కరణ జరిగింది. ఇప్పటికే మూడు లక్షల మందికి వ్యాక్సినేషన్ పూర్తి కాగా… రెండో విడత వ్యాక్సినేషన్ సైతం ప్రారంభమైంది. ఇప్పటివరకు కట్టడిలోనే ఉన్న వైరస్ వ్యాప్తి… మళ్లీ క్రమంగా పెరుగుతుండటంతో… ప్రజలు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.