Telugu News CoronaVirus One covid 19 positive case found in rashtrapati bhavan 125 families sent on home quarantine
బ్రేకింగ్ న్యూస్: రాష్ట్రపతి భవన్‌లో పాజిటివ్ కేసు, 500 మంది
అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో దేశంలోనే ఢిల్లీ రెండో స్థానంలో నిలిచింది. తాజాగా కరోనా వైరస్ రాష్ట్రపతిభవన్‌కు పాకినట్లు తెలుస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కోరలు చాస్తున్న కోవిడ్ వైరస్ కరాళనృత్యం చేస్తోంది. కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా ఢిల్లీ తీవ్రంగా సతమతమవుతోంది. ఇప్పటికే రెండు వేలకుపైగా కరోనా పాజిటివ్ నమోదయ్యాయి. 47 మంది మరణించారు. అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో దేశంలోనే ఢిల్లీ రెండో స్థానంలో నిలిచింది. దీని కట్టడికోసం కేంద్రం విధించిన లాక్‌డౌన్ నిబంధనలు యథాతథంగా కొనసాగించాలని సీఎం కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా కరోనా వైరస్ రాష్ట్రపతిభవన్‌కు పాకినట్లు తెలుస్తోంది.
హస్తినలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ప్రతిష్టాత్మక రాష్ట్రపతిభవన్‌లో కరోనా పాజిటివ్ కేసు వెలుగులోకి వచ్చింది. రాష్ట్రపతి భవన్‌లో పనిచేసే ఒక పారిశుధ్య కార్మికుని బంధువుకు కరోనా పాజిటివ్‌గా తేలినట్లు తెలుస్తోంది. మరోవైపు అతని తల్లి ఇప్పటికే కరోనాతో మరణించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కార్మికుని ఇంటిని అధికారులు సీజ్ చేశారు. కుటుంబ సభ్యులను ఈ నెల 18నే క్వారంటైన్‌కు పంపించారు. మరోవైపు కార్మికుని ఇంటికి సమీపంలోని 30 ఉద్యోగ కుటుంబాలను అధికారు పర్యవేక్షణలో ఉంచారు. ప్రభుత్వమే వారికి ఆహారం సరఫరా చేస్తోంది. తాజాగా మరో 95 కుటుంబాలను క్వారంటైన్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. ఉద్యోగులతోపాటు కుటుంబంలోని ఎవరినీ ఇంటి నుంచి బయటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. మొత్తంమీద ఈ 125 కుటుంబాల నుంచి 500 మందిని సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంచినట్లు సమాచారం.