AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicron Variant: డెల్టా వేరియంట్‌తో పోల్చుకుంటే ఓమిక్రాన్‌తో ప్రమాదం తక్కువే: ఆఫ్రికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌

కరోనా మహమ్మారి ఇప్పట్లో మనల్ని వదిలిపెట్టేలా లేదు. కొత్త కొత్త పేర్లతో ఉనికిని, రూపాంతరాన్ని మార్చుకుంటూ మనపై దాడిచేస్తోంది

Omicron Variant: డెల్టా వేరియంట్‌తో పోల్చుకుంటే ఓమిక్రాన్‌తో ప్రమాదం తక్కువే: ఆఫ్రికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌
Basha Shek
|

Updated on: Nov 28, 2021 | 4:52 PM

Share

కరోనా మహమ్మారి ఇప్పట్లో మనల్ని వదిలిపెట్టేలా లేదు. కొత్త కొత్త పేర్లతో ఉనికిని, రూపాంతరాన్ని మార్చుకుంటూ మనపై దాడిచేస్తోంది. అలా ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్‌ ‘ఓమిక్రాన్’ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసిస్తోంది. దక్షిణాఫ్రికాలో బయటపడిన B.1.1.529 అనే వైరస్‌ డెల్టా వేరియంట్ కంటే ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉందని, ప్రస్తుతం వ్యాక్సిన్‌లు కూడా దీనికి అంతగా పనిచేయకపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్‌ కారణంగా ప్రపంచ దేశాలతో పాటు ఇండియాలో కూడా హై అలెర్ట్‌లు జారీ అయ్యాయి. మళ్లీ కరోనా నిబంధనలు, ఆంక్షలు అమలుచేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే శాంతించిందనుకున్న కొవిడ్‌ మళ్లీ ఇలా మహమ్మారి రూపంలో తిరగబెట్టడంతో అందరూ మళ్లీ ఆందోళనకు గురవుతున్నారు. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే విమానాలపై నిషేధం, ఆంక్షలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆఫ్రికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఏఎంఏ) శాస్త్రవేత్తలు, వైద్యులు ఓ మంచి కబురును తీసుకొచ్చారు. డెల్టా వేరియంట్‌తో పోల్చుకుంటే ఓమిక్రాన్‌ వేరియంట్‌ ప్రభావం తక్కువేనని, మరణాలు కూడా తక్కువగానే నమోదవుతాయని ఊరటనిచ్చే విషయాన్ని చెప్పింది. ఆఫ్రికాలో గత రెండు నెలలుగా నమోదవుతున్న కొత్త కేసులు, మరణాల్లో క్షీణతే ఇందుకు నిదర్శనమని ఏఎంఏ చెప్పుకొచ్చింది.

కేసులు, మరణాలు తగ్గుతున్నాయి.. అందరూ అనుకున్నట్లు ఈ వైరస్‌ ఇప్పుడే బయటపడలేదని రెండు నెలల క్రితమే దక్షిణాఫ్రికాలో ఈ కొత్త వేరియంట్‌ వెలుగు చూసిందని ఆఫ్రికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ నివేదిక వెల్లడించింది. ‘ఆఫ్రికా దేశాల్లో రెండు నెలల క్రితమే ఈ కొత్త వేరియంట్‌ కేసులు బయటపడ్డాయి. ఈ వేరియంట్ అత్యంత అంటువ్యాధి కలిగిన డెల్టా వేరియంట్ కంటే 7 రెట్లు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉందని అందరూ విశ్లేషిస్తున్నారు. వ్యాక్సిన్లు కూడా తక్కువ ప్రభావితం చేస్తాయంటున్నారు. అయితే డెల్టా వేరియంట్‌తో పోల్చుకుంటే ఈ కొత్త వేరియంట్ ప్రమాదకరమైనది కాదు. 45 మ్యూటేషన్లను కలిగిఉన్నందున మరణాలు కూడా తక్కువగానే నమోదవుతాయని మేం భావిస్తున్నాం. ఈ వైరస్‌కు సంబంధించి ఆఫ్రికాలో గత రెండు నెలలుగా కేసులు, మరణాల్లో చాలా తగ్గుదల కన్పిస్తోంది. వైరస్‌ సోకిన వారిలో కూడా చాలా తేలికపాటి లక్షణాలు మాత్రమే కనిపించాయి.’

యూరప్‌లోనే ఎక్కువ కేసులు.. ‘అక్టోబర్ 1 – నవంబర్ 26 మధ్య కాలంలో ఆఫ్రికా దేశాల్లో మొత్తం 4,200 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవి యూరప్ దేశాల్లో నమోదైన పాజిటివ్‌ కేసుల కంటే 86 రెట్లు తక్కువ. అంతేకాదు ఇక్కడ నమోదయ్యే రోజువారీ మరణాలు కూడా 150 కంటే తక్కువగా ఉన్నాయి. ఇవి కూడా యూరప్ కంటే 26 రెట్లు తక్కువ. ప్రస్తుతం కొత్త కేసులు, మరణాలు కూడా క్రమంగా క్షీణిస్తున్నాయి. ఆఫ్రికా ఖండ దేశాలతో పోల్చుకుంటే యూరప్‌ దేశాల్లో పరిస్థితి సంక్లిష్టంగా ఉంది. అక్కడి దేశాల్లో రోజుకూ 3.63 లక్షల మంది మహమ్మారి బారిన పడుతున్నారు . అంతేగాక వైరస్‌ బారిన పడి రోజుకు 3,880 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే నేటికీ యూరప్‌ఖండంలో నమోదయ్యే మరణాల రేటు క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ కేసులన్నీ డెల్టా వేరియంట్‌కు చెందినవే కావడం గమనార్హం’ అని ఆఫ్రికన్ మెడికల్ అసోసియేషన్ నివేదిక తెలిపింది.