Coronavirus: ఫేస్ మాస్క్‌ల విషయంలో అంతుచిక్కని WHO వైఖరి.. గందరగోళ ప్రకటనలతో అయోమయానికి గురిచేస్తోందంటోన్న శ్వాసకోశ నిపుణులు..
కరోనా వైరస్ (Corona Virus) విషయంలో మొదటి నుంచి విమర్శల్ని ఎదుర్కొంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) . చైనా(China) లోని వుహాన్ లో పురుడు పోసుకున్న ఈ వైరస్ గురించి ముందుగానే ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయలేదన్న అపవాదును ఎదుర్కొంది
కరోనా వైరస్ (Corona Virus) విషయంలో మొదటి నుంచి విమర్శల్ని ఎదుర్కొంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) . చైనా(China) లోని వుహాన్ లో పురుడు పోసుకున్న ఈ వైరస్ గురించి ముందుగానే ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయలేదన్న అపవాదును ఎదుర్కొంది. అలాగే వైరస్ పుట్టుకకు కారణమైన చైనాపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రపంచ దేశాలు WHOపై మండిపడ్డాయి. కాగా కరోనా నిబంధనలు, జాగ్రత్తలకు సంబంధించి విషయాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసే ప్రకటనలు, మార్గదర్శకాలు గందరగోళానికి, అయోమయానికి దారి తీస్తున్నాయి. ముఖ్యంగా మాస్కులు ధరించే విషయంలో డబ్ల్యూహెచ్ వో ప్రతినిధులు చెబుతున్న మాటల్లో స్థిరత్వం ఉండడం లేదని ఆరోగ్య నిపుణులు, శ్వాసకోశ నిపుణులు చెబుతున్నారు.
గందరగోళ ప్రకటనలు..
కరోనా ప్రారంభంలో వైరస్ లక్షణాలు కనిపించిన వారు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు మాత్రమే మాస్క్ ధరిస్తే చాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అంతేకాదు సాధారణ ప్రజలు ధరించే ఫేస్ మాస్క్ లు వారికి మంచి కంటే చెడునే ఎక్కువ కలిగిస్తాయని చెప్పింది. మాస్క్ ధరించినప్పుడు ముఖాన్ని తాకడం వల్ల వైరస్ శరీరంలోకి చేరుతుందని పేర్కొంది. దీనికితోడు సర్జికల్ మాస్కుల వాడకంపై భిన్న ప్రకటనలు, మార్గదర్శకాలు వెలువరించింది. ఇలా మాస్క్ ల విషయంపై WHO జారీ చేసే ప్రకటనలు తమను ఆశ్చర్యం కలిగిస్తున్నాయని ఎయిమ్స్ లోని శ్వాసకోశ వ్యాధుల విభాగం అధిపతి లీనా ఘోష్ అంటున్నారు. ఫేస్ మాస్క్ ల విషయమై ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఒక స్థిరమైన విధానం లేకపోవడంతో ఆ సంస్థ తీవ్ర విమర్శలు మూటగట్టుకుందని ఆమె పేర్కొన్నారు.
అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా..
కాగా మాస్క్ ల విషయమై వివిధ సందర్బాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ వెలువరించిన ప్రకటనలు, మార్గదర్శకాలు ఒకసారి పరిశీలిస్తే..
*జనవరి 29, 2020 లో WHO విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఇలా ఉంది ‘మెడికల్ మాస్క్ లు కొనుగోలు చేయడం ఖర్చుతో కూడుకున్న పని. పైగా వీటిని ధరించడం వల్ల చాలామంది భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించరు. కేవలం కొవిడ్ లక్షణాలు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నవారు మాత్రమే మెడికల్ మాస్కులు ధరిస్తే సరిపోతుంది’ అని ఉంది.
* ఏప్రిల్ 7, 2020లో WHO శాస్త్రీయ, సాంకేతిక సలహా బృందానికి అధ్యక్షత వహించిన ప్రొఫెసర్ డేవిడ్ హమాన్ మాట్లాడుతూ ‘ భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోతే మాస్క్ లు ధరించినా పెద్దగా ప్రయోజనముండదు. వీటిని వాడడం వల్ల వైరస్ నుంచి పూర్తి స్థాయిలో రక్షణ పొందలేం’ అని చెప్పుకొచ్చారు.
*జూన్ 8, 2020 లో WHO నిర్వహించిన ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆసంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖెల్ ర్యాన్ మాట్లాడుతూ ‘ కేవలం వైరస్ ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు మాత్రమే మాస్క్ సహాయపడుతుంది’ అని చెప్పుకొచ్చారు. అదే నెలలో WHO డైరెక్టర్ జనరల్ మాస్క్ లు ప్రజల్లో నిర్లక్ష్య భావనను పెంపొందిస్తాయని, భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించకుండా చేస్తాయన్నారు. కేవలం మాస్క్ లు ధరించినంత మాత్రాన వైరస్ నుంచి రక్షణ పొందలేమని వ్యాఖ్యానించారు.
*ఆగస్టు 21, 2021 న WHO జారీ చేసిన మార్గదర్శకాల్లో బయటకు వెళ్లిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మూడు లేయర్ల నాన్ సర్జికల్ మాస్క్ లు ధరించాలని సూచించింది. అదే సమయంలో ఐదేళ్లలోపు పిల్లలకు మాస్క్ అవసరం లేదని పేర్కొంది.
*జూన్ 25, 2021 డెల్టా వేరియంట్ వేగంగా విస్తరిస్తోన్న ఈ సమయంలో మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని, సామాజిక దూరం పాటించాలని కోరింది. టీకాలు తీసుకున్నవారు కూడా తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని మరీ నొక్కి చెప్పింది.
* జనవరి 2022 న WHO వెలువరించిన మార్గదర్శకాల్లో క్లాత్ మాస్క్ లు, హోమ్ మేడ్ మాస్క్ లను కేవలం చివరి ఎంపికగా తీసుకోవాలని సూచించింది. అదేవిధంగా ప్రజల కోసం మూడు రకాల మాస్క్ లను సిఫార్సు చేసింది. ASTM F3502 స్టాండర్డ్ లేదా CEN వర్కింగ్ అగ్రిమెంట్ 17553 లేదా WHO ప్రమాణాలు, పారామీటర్ లకు అనుగుణంగా ఉండే నాన్ మెడికల్ మాస్క్ లను ధరించాలని సూచించింది. క్లాత్, హోం మేడ్ మాస్క్ లను చివరి ఎంపికగా తీసుకోవాలని కోరింది.
WHO ఆలస్యం చేసింది..
కాగా ఇలా మాస్క్ ల విషయంపై WHO అయోమయ ప్రకటనలు, మార్గదర్శకాలు జారీచేయడంపై ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రి శ్వాసకోశ వైద్య నిపుణురాలు డాక్టర్ వినీ క్రాంతూ మరోలా స్పందించారు. ‘ వైరస్ ఎప్పటికప్పుడు తన రూపాన్ని, ఉనికిని మార్చుకుంటోంది. దీనికి తోడు కరోనా వైరస్ మూలాలేంటో ఇప్పటికీ స్పష్టంగా తెలియడం లేదు. అదే సమయంలో వైరస్ వేగంగా వ్యాపించకుండా, కఠిన చర్యలు తీసుకోవడంలో, మార్గదర్శకాలను రూపొందించడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చాలా ఆలస్యం చేసింది. అందుకే మహమ్మారి విజృంభించింది. వారు వైరస్ కట్టడికి సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉండాల్సింది. ముఖ్యంగా ఫేస్ మాస్క్ ల విషయంలో గందరగోళ ప్రకటనలు వెలువరించాల్సింది కాదు. అయితే ఏ ప్రకటన వెలువరించేముందు వారు పూర్తిస్థాయిలో అధ్యయనం చేసే ఉంటారని నేను భావిస్తున్నాను. అందుకే వారు తరచూ తమ వైఖరిని మార్చుకుంటున్నారు. ఏదేమైనా వైరస్ నుంచి రక్షణ పొందాలంటే స్వీయ రక్షణ చర్యలు పాటించాల్సిందే. మాస్క్ లు తప్పనిసరిగా ధరించాల్సిందే ‘ అని డాక్టర్ చెప్పుకొచ్చారు.
Also read: BECIL Jobs: డిగ్రీ అర్హతతో బీఈసీఐఎల్‌లో 28 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివిగో!
Sarkaru Vaari Paata: మహేష్ సర్కారు వారి పాట మూవీ ఫస్ట్ సింగిల్ రెడీ .. రిలీజ్ ఎప్పుడంటే..