Corona Recovered Patients : దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజు రోజుకు కేసులు విస్తృతంగా పెరిగిపోతున్నాయి. ఆస్పత్రుల్లో బెడ్స్ కరువై పేషెంట్లు నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు బెడ్స్ దొరికినా ఆక్సిజన్ అందక ఎన్నో ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఇదిలా ఉంటే కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులు కూడా అవస్థలు పడుతూనే ఉన్నారు. లాంగ్ కొవిడ్ లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారు. దగ్గు, ఊపిరి, ముక్కు కారటం, అధిక అలసట, తలనొప్పి, కీళ్లు లేదా కండరాల నొప్పులు, ఆందోళన, నిరాశ దీర్ఘ కాలిక కోవిడ్ లక్షణాలు. ఇది అనారోగ్యంతో బాధపడుతున్న మగవారు, మహిళలలో ఎక్కువగా ఉంటుంది.
ఇలా ధీర్ఘకాలిక లక్షణాలతో బాధపడుతూ బ్లాక్ ఫంగస్‌కి గురవుతున్నారు. కరోనా సెకండ్ వేవ్‌లో బ్లాక్ ఫంగస్ కేసులు వీపరీతంగా నమోదవుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఇప్పుడు మరో కొత్త సమస్య మొదలైంది. కరోనా నుంచి కోలుకున్న చాలా మందిలో కాళ్లు రంగు మారడం కనిపిస్తుంది. దీంతో చాలామంది భయందోళను చెందుతున్నారు. పాదాల నొప్పి, గ్యాంగ్రేన్ రకం సమస్య ఉత్పన్నమవుతున్నాయి. ఇందువల్ల చాలామంది తమ కాళ్లను కోల్పోతున్నారు. కరోనా నుంచి కోలుకొని ఎటువంటి అనారోగ్య సమస్యలు లేనివారికి కొత్తగా ఈ సమస్య వస్తోంది. ఇప్పటి వరకు ఈ సమస్య ఉన్న 200 మందిలో వైద్యులు 30మందికి పైగా కాళ్లను తొలగించారు. దీంతో కరోనా సోకిన వ్యక్తులు చాలా అప్రమత్తంగా ఉండటం అవసరం. నిత్యం వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.