వందేళ్ల నాటి వైరస్‌ని పోలిన కరోనా.. లక్షల సంఖ్యలో మరణాలు ! : డబ్ల్యూహెచ్ఓ
కంటికి కనిపించని కరోనా వైరస్..ప్రపంచ దేశాల ఉమ్మడి శత్రువుగా మారింది. కోవిడ్ మహమ్మారిని గురించి రోజుకో కొత్త భయంకర వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో లక్షల మందిని పట్టి పీడిస్తున్న కరోనా రక్కసి రెండోసారి దాడి చేస్తే..
కంటికి కనిపించని కరోనా వైరస్..ప్రపంచ దేశాల ఉమ్మడి శత్రువుగా మారింది. కోవిడ్ మహమ్మారిని గురించి రోజుకో కొత్త భయంకర వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో లక్షల మందిని పట్టి పీడిస్తున్న కరోనా రక్కసి రెండోసారి దాడి చేస్తే లక్షల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డా. రనేరీ గెర్రా హెచ్చరించారు. కరోనా సంక్షోభానికి, వందేళ్ల నాటి స్పానిష్ ఫ్లూ వ్యాప్తికీ చాలా దగ్గర పోలికలున్నాయని వారు స్పష్టం చేశారు.
1918లో వచ్చిన స్పానిష్ ఫ్లూ మొదట్లో కరోనా లాగే నెమ్మదిగా వ్యాపించి.. ఆ తర్వాత భయంకరమైన ప్రభావం చూపించింది. అప్పట్లో ఈ వ్యాధి కారణంగా భారత్ లో ఏకంగా కోటిన్నర మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా వారు గుర్తు చేశారు. అప్పట్లో భారతీయ సమాజంలో ఉండి ఉన్ననిరక్షరాస్యత, అపరిశుభ్ర వాతావరణం ఎక్కువగా ఉండటం కూడా ఫ్లూ మరణాల రేటును పెంచిందన్నారు. మరోవైపు అప్పటి బ్రిటీష్ ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా దీనికి తోడైందని వ్యాఖ్యానించారు. ఎండాకాలంలో నెమ్మదించిన వైరస్ ..సెప్టెంబర్, అక్టోబర్ నాటికి మరింత రెచ్చిపోయిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం కరోనా కూడా స్పానిష్ ఫ్లూ తరహాలోనే ప్రతాపం చూపెడుతోందన్నారు. స్పానిష్ ఫ్లూ అనుభవం మనకు నేర్పిన పాఠాలను బట్టి కరోనా రెండో సారి మరింత తీవ్రంగా దాడి చేసే అవకాశం ఉందని డా. రనేరీ గెర్రా హెచ్చరించారు. ఇక యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు చీఫ్ క్రిస్టీన్ లగార్డే కూడా కోవిడ్‌పై ఇదే విధమైన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం విస్తరిస్తున్న కరోనాను నియంత్రించాలంటే నివారణ చర్యల్లో ముమ్మర ప్రయత్నాలు జరగాల్సిన అవసరం చాలా ఉంది. కేవలం ప్రభుత్వమే కరోనాను కంట్రోల్ చేయలేదు. ప్రజల భాగస్వామ్యం తప్పని కావాల్సిందే. ఇక, స్పానిష్ ఫ్లూ వచ్చేనాటికీ ఇంకా యాంటీ బయాటిక్స్ అందుబాటులోకి రాలేదు. కానీ ఇప్పడు కరోనా కాలంలో విస్తృతమైన యాంటీ బయాటిక్స్ అందుబాటులో ఉన్నాయి. అప్పటితే పోలిస్తే ఇప్పుడు దేశంలో అక్షరాస్యత, పరిశుభ్రత కూడా గణనీయంగా మెరుగైంది. ప్రభుత్వం కూడా మిగతా దేశాల కంటే వేగంగానే చర్యలు తీసుకుంటోంది. కానీ, ప్రభుత్వం ప్రకటించిన అన్‌లాక్‌తో ప్రజల్లో కోవిడ్ భయం తగ్గింపోయిందనే సందేహాలు వ్యక్తం మవుతున్నాయి. కరోనాను సీరియస్‌గా తీసుకుని స్వీయ నియంత్రణ చర్యలు తప్పక పాటించాల్సిన అవసరం ఎంతైన ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.