Corona survey : కరోనా స్ట్రెయిన్ లక్షణాలల్లో భాగంగా జ్వరాలు, కొవిడ్ లక్షణాలు ఉండేవారిని గుర్తించేందుకు క్షేత్ర స్థాయిలో సర్వే బృందాలు పూర్తి స్థాయిలో పనిచేశాయని కృష్ణాజిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ తెలిపారు. మొత్తం 2, 90, 380 ఇళ్లను సందర్శించి 2, 398 మంది లక్షణాలు ఉన్నవారిని గుర్తించడం జరిగిందని చెప్పారు. ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, రాష్ట్ర కొవిడ్ పర్యవేక్షణ ఛైర్మన్ కె.ఎస్. జవహర్ రెడ్డి, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అశోక్ కుమార్ సింఘాల్.. కృష్ణా జిల్లాలో కొవిడ్ పరిస్థితుల గురించి జూమ్ కాన్ఫెరెన్సు ద్వారా సమీక్షించారు. విజయవాడ నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ.. గత 4 రోజుల్లో పాజిటివ్ కేసుల్లో 2 శాతం తగ్గుదల ఉందన్నారు. జిల్లాలో మే 2 నుంచి 8 వరకు 56, 575 కరోనా పరీక్షలు నిర్వహించగా 6,821 (12.06 శాతం) పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు.
మే 9 నుంచి 15 వరకు 57,055 పరీక్షలు నిర్వహించాగా 6, 311 (11.06 శాతం) కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. గత 4 రోజులుగా జిల్లాలో 37,281 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించాగా 3,700 పాజిటివ్ కేసులు గుర్తించమన్నారు. ఈ పరీక్షల్లో 9. 92 శాతం మందికి మాత్రమే కొవిడ్ ఉన్నట్లు తేలిందని కలెక్టర్ వివరించారు.