
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విళయ తాండవం చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. లాక్‌డౌన్ ప్రకటించినప్పటికీ.. కేసుల తీవ్రత ఇలా ఉండటంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇక కర్ణాటకలో కూడా ఈ వైరస్ విజృంభిస్తోంది. తాజాగా గురువారం కొత్తగా మరో ముప్పై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులిటెన్ విడుదల చేసింది. ఇవాళ నమోదైన కేసులతో.. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 565 కి చేరింది. అయితే ఇవాళ నమోదైన 30 కొత్త కేసుల్లో14 కేసులు బెళగావిలోనే నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇక ఇప్పటి వరకు కర్ణాటక రాష్ట్రంలో 223 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక కరోనా బారినపడి 21 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటించింది.