కరోనా డీలక్స్ గదులు..మంత్రులు, ఎమ్మెల్యేలు, వీఐపీలకు మాత్రమే!
కరోనా సోకిన సాధారణ ప్రజలకు ఆస్పత్రుల్లో కనీస సదుపాయాలు కూడా లభించక అవస్థలు పడుతున్న సందర్భాలు ఎదురవుతున్నాయి. ఇదిలా ఉంటే, మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు, వీఐపీలు, ప్రభుత్వ అధికారుల కోసం సకల ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడి అధికారులు.

దేశంలో కరోనా వైరస్ స్వైర విహారం చేస్తోంది. రోజుకు వేల సంఖ్యలో కోవిడ్ కేసులు బయటపడుతుండగా..ఆస్పత్రుల్లో బెడ్లు, ఐసోలేషన్ సదుపాయాలు అందక అవస్థలు పడాల్సిన దుస్థితి చాలా ప్రాంతాల్లో ఎదురవుతోంది. ఇకపోతే, కరోనా సోకిన సాధారణ ప్రజలకు ఆస్పత్రుల్లో కనీస సదుపాయాలు కూడా లభించక అవస్థలు పడుతున్న సందర్భాలు ఎదురవుతున్నాయి. ఇదిలా ఉంటే, మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు, వీఐపీలు, ప్రభుత్వ అధికారుల కోసం సకల ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడి అధికారులు.
కర్ణాటకలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుండగా, అక్కడ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. బెంగళూరులో ఇటీవల పునరుద్ధరించిన కుమార కృప అతిథి గృహంలోని వంద డీలక్స్ గదులను కరోనా సోకిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వ ఉన్నతాధికారుల కోసం కేటాయిస్తున్నట్లు యెడ్యూరప్ప ప్రభుత్వం బుధవారం(జూన్24న) ఉత్తర్వులు జారి చేసింది. ఈ వీవీఐపీ అతిథి గృహంలోని లగ్జరీ గదుల భర్తీ 33 శాతం మించకుండా చూడాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఓ వైపు కరోనా బారినపడుతున్న సాధారణ ప్రజలు ఆస్పత్రుల్లో చోటు, వసతులు లేక అల్లాడుతుంటే.. మంత్రులు, ఎమ్మెల్యేలకు డీలక్స్ గదులను కేటాయించడాన్ని తప్పుబడుతూ విమర్శలు చేస్తున్నారు. అయితే.. అధికార పార్టీ నేతలు మాత్రం ప్రభుత్వ చర్యను సమర్థించుకుంటున్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుంటున్నట్లు వివరణ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే, కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్య పది వేల మార్కును దాటింది. కాగా రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారినపడి 164 మంది మృత్యువాతపడ్డారు.




