ఇది నిరుద్యోగ భారతం ! ఏమౌతుందీ దేశం ? పలుగూ, పారా పట్టుకున్న యువత !

కాలేజీలు, యూనివర్సిటీల్లో డిగ్రీలు, పీజీ డిగ్రీలు చదివిన యువతే ఇప్పుడు పలుగూ, పారా పట్టుకుని పల్లెలు, గ్రామాల్లో బతుకు బండి నెట్టుకొస్తోంది. మెతుకు కోసం అతకని బతుకుకు..

  • Umakanth Rao
  • Publish Date - 3:29 pm, Sat, 6 June 20
ఇది నిరుద్యోగ భారతం ! ఏమౌతుందీ దేశం ? పలుగూ, పారా పట్టుకున్న యువత !

కాలేజీలు, యూనివర్సిటీల్లో డిగ్రీలు, పీజీ డిగ్రీలు చదివిన యువతే ఇప్పుడు పలుగూ, పారా పట్టుకుని పల్లెలు, గ్రామాల్లో బతుకు బండి నెట్టుకొస్తోంది. మెతుకు కోసం అతకని బతుకుకు అలవాటు పడుతోంది. కరోనా వైరస్ లాక్ డౌన్ ‘పుణ్యమా’ అని.. ఈ ‘ఆకలిరాజ్యం’ లో వాళ్ళు కూడా వలస కార్మికుల మాదిరే పట్టెడన్నం కోసం ఎండనకా, వాననకా కష్టపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కనీసం 35 లక్షల మంది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద..ఏదో ఒక ఉపాధి (పని) కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. వీరిలో గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఎంబీఏలుచదివినవారూ ఉన్నారు. ఒక్క ఉత్తరప్రదేశ్ విషయానికే వస్తే.. లాక్ డౌన్ ఆంక్షలు సడలించిన అనంతరం సుమారు 30 లక్షల వలస కుటుంబాలు ఈ స్టేట్ కి తిరిగి వచ్చాయి. వీళ్ళలో ఇలా విద్యాధికులు కూడా చాలామందే ఉన్నారు.

లాక్ డౌన్ విధించక ముందు తాము నెలకు కనీసం ఏడెనిమిది వేల రూపాయల  జీతం తెచ్చుకునేవారమని, కానీ ఈ లాక్ డౌన్ తమ బతుకులనే మార్చివేసిందని కొందరు గ్రాడ్యుయేట్లు తెలిపారు. ఉద్యోగాలు కోల్పోయాక.. గ్రామాల్లో చెరువులు, రోడ్ల తవ్వకాల్లో పని సంపాదించామని చెబుతున్నారు వాళ్ళు. లాక్ డౌన్ విధించక ముందు రోజుకు సగటున 20 మంది వలస కార్మికులు, కూలీలు ఉపాధి హామీ పనులు నిర్వహిస్తుండగా ఇప్పుడిది 100 మందికి పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా దాదాపు 14 కోట్ల మందికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జాబ్ కార్డులు ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రతి కార్డు హోల్డర్ కీ 100 రోజుల పని దొరకాలంటే ప్రభుత్వానికి రూ. 2.8 లక్షల కోట్లు అవసరమని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి.. ఇటీవల ప్రధాని మోదీ ప్రకటించిన 20 లక్షల కోట్ల భారీ ఎకనామిక్ ప్యాకేజీ, ఆ తరువాత ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఐదు రోజులపాటు ఈ ప్యాకేజీ నేపథ్యంలో వెదజల్లిన ‘వరాలు’…..ఈ నిరుద్యోగ యువతను ఎంతవరకు ఆదుకుంటాయో చూడాలి !