కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముందుముందు మరింత జోరందుకోనుంది. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన కొవిషీల్డ్, కొవాక్సిన్, స్పుట్నిక్ వీ వ్యాక్సిన్లకు తోడు మరికొన్ని విదేశీ వ్యాక్సిన్లు దేశ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. అలాగే దేశంలో వ్యాక్సిన్ల ఉత్పత్తి ఒకట్రెండు మాసాల్లోనే గణనీయంగా పెరిగే అవకాశముంది. ఈ సంవత్సరం చివరినాటికల్లా దేశంలోని అందరికీ వ్యాక్సిన్లు అందేలా చూస్తామని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యమేనా? అన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సస్(AIIMS) చీఫ్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముందు ముందు జోరందుకోనున్నట్లు చెప్పారు.
దేశంలో ఎక్కువ మందికి వ్యాక్సిన్లను అందుబాటులోకి తెచ్చేందుకు వాటి ఉత్పత్తిని గణనీయంగా పెంచనున్నట్లు రణ్‌దీప్ గులేరియా పేర్కొన్నారు. అలాగే విదేశాల నుంచి వీలైనన్ని వ్యాక్సిన్లు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వివరించారు. జులై మాసం చివరి నాటికి దేశంలో ప్రతి రోజు కోటి మందికి వ్యాక్సిన్లు ఇచ్చే అవకాశమున్నట్లు ఆయన వెల్లడించారు. గర్భిణి మహిళలు కరోనా బారినపడి ఎక్కువగా చనిపోతుండటంపై స్పందిస్తూ…దేశంలో గర్భిణి మహిళలకు వీలైనంత త్వరగా వ్యాక్సిన్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. అయితే గ్లోబల్ గణాంకాలను పరిశీలిస్తే…గర్భిణి మహిళలకు వ్యాక్సినేషన్‌లో ప్రభావం కాస్త ప్రతికూలంగా ఉందన్నారు.
కొవాక్సిన్ టీకా ఇతర ఫ్లూ వ్యాక్సిన్లు తరహాదేనన్న ఆయన… గర్భిణి స్త్రీలకు ఇది సురక్షితం కావచ్చని అభిప్రాయపడ్డారు. ఇమ్యునిటీని పెంచుకునే ఉద్దేశంతో ప్రజలు భారీ ఎత్తున మల్టీవిటమిన్లు, జింక్ సప్లిమెంట్స్‌ను తీసుకోవడంపై ఆయన స్పందించారు. దాని ద్వారా వచ్చే నష్టమేమీ లేదుకానీ…ఎక్కువ కాలంపాటు వీటిని తీసుకోవడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ… సహజ వనరులతో శరీరంలో విటమిన్లు, జింక్ పెంచుకునేందుకు ప్రజలు ప్రయత్నించాలని సూచించారు.
ఎయిమ్స్ చీఫ్ గులేరియా పేర్కొన్నట్లు దేశంలో జులై చివరినాటికి ప్రతి రోజూ కోటి మందికి వ్యాక్సిన్లు ఇవ్వగలిగే సామర్థ్యం పొందితే…సంవత్సరం చివరి నాటికల్లా దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ దాదాపు పూర్తయ్యే అవకాశముంది.
ఇవి కూడా చదవండి..