దేశ రాజధాని ఢిల్లీలో కరోనా స్వైర విహారం చేస్తోంది. లెక్కకు మించిన పాజిటివ్ కేసులతో ఢిల్లీలోని ఆస్పత్రులన్నీ కిక్కిరిసిపోయాయి. రోజుకూ వేల సంఖ్యలో నమోదవుతున్న కొత్త కేసులతో బాధితులకు ఆసుపత్రులో బెడ్లు దొరకడం గగనంగా మారింది. ఈ క్రమంలో తొలిసారిగా ఢిల్లీలోని దర్యగంజ్‌లో షెహనాయ్ బంకెట్ హాల్‌ను కోవిడ్ కేర్ సెంటర్‌గా మార్చారు.
రాష్ట్రంలోనే అతిపెద్ద కరోనా ఆసుపత్రి అయిన లోక్ నాయక్ జయ ప్రకాశ్ నారాయణ్ హాస్పిటల్(ఎల్ఎన్‌జెపి)కు అనుసంధానంగా షెహనాయ్ బంకెట్ హాల్ కోవిడ్ కేర్ సెంటర్ పనిచేస్తుంది. కాగా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో కలిసి బుధవారం ఈ కోవిడ్ కేర్ సెంటర్‌ను ప్రారంభించారు. 100 పడకల సామర్థ్యం కలిగిన ఈ బంకెట్ హాల్‌లో 50 మంది హెల్త్ కేర్ సిబ్బంది పని చేస్తారు.
ఈ సందర్భంగా ‘డాక్టర్స్ ఫర్ యు’ ఎన్జీవో వ్యవస్థాపకుడు డా.రవికాంత్ సింగ్ మాట్లాడుతూ.. “ఇక్కడ అన్ని సేవలు ఉచితమేనని వెల్లడించారు. పేషెంట్ల ఖర్చు తామే భరిస్తామని చెప్పారు.. ఇక్కడ పన్నెండు మంది డాక్టర్లు, 24 మంది నర్సులు, 20 మంది వార్డ్ బాయ్‌లు అందుబాటులో ఉంటారని, అత్యవసర వేళల్లో ఉపయోగించేందుకు ఆక్సిజన్ సిలిండర్లు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కాగా మరో 80 బంకెట్ హాళ్లను సైతం కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చేందుకు ఆప్ ప్రభుత్వం యోచిస్తోంది. తద్వారా అదనంగా 11వేల బెడ్లు అందుబాటులోకి వస్తాయి. విజృంభిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు పలు రకాల ప్రయత్నాలు చేస్తోంది.