‘కరోనా ఇంజక్షన్’..రూ.లక్షా 20వేలట!..దళారీ చేతివాటం

|

Jul 23, 2020 | 7:20 PM

ఓ వైపు మహమ్మారి కరోనా జడలు విప్పుకుంటోంది. మరోవైపు వర్షాకాలం ఆరంభంతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇక ఇదే అదునుగా, ధనార్జనేధ్యేయంగా కొందరు కేటుగాళ్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు.

‘కరోనా ఇంజక్షన్’..రూ.లక్షా 20వేలట!..దళారీ చేతివాటం
Follow us on

ఓ వైపు మహమ్మారి కరోనా జడలు విప్పుకుంటోంది. మరోవైపు వర్షాకాలం ఆరంభంతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇక ఇదే అదునుగా, ధనార్జనేధ్యేయంగా కొందరు కేటుగాళ్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అమాయకుల్లో నిండిపోయిన కరోనా భయాన్ని అడ్డుపెట్టుకుని కాసుల వేట కొనసాగిస్తున్నారు. దొరికిన వారిని దొరికినంతా దోచుకుని లూటీ చేసేస్తున్నారు. తాజాగా ఏపీలోని రిమ్స్‌లో కరోనా ఇంజన్ పేరిట కొందరు దళారులు సాగిస్తున్న అక్రమ దందాపై పోలీసులు నిఘాపెంచారు.

ఒంగోలు రిమ్స్‌ వైద్యశాలలో కరోనా పేషెంట్లను కొంతమంది దళారులు అడ్డంగా దోచుకుంటున్నారు. కరోనాకు ఇంజక్షన్‌ వేస్తే ఊపిరితిత్తుల్లో రిలీఫ్‌ వస్తుందంటూ హైదరాబాద్‌లో దొరికే అక్టెమ్‌రా అనే ఇంజక్షన్‌లను తీసుకొచ్చి అక్రమ దందాకు తెరలేపారు. కరోనాతో ఊపిరాడక ఇబ్బందులు పడుతున్న వారికి ఈ ఇంజక్షన్‌ వేయడం వల్ల కొంత రిలీఫ్‌ వస్తుందన్న సమాచారంతో బాధితుల బంధువులు ఈ ఇంజక్షన్ల కోసం వేలు, లక్షలు ఖర్చుపెడుతున్నారు. బాధితుల అవసరాన్ని ఆసరాగా చేసుకున్న కొంతమంది దళారులు హైదరాబాద్‌ నుంచి ఈ ఇంజక్షన్‌ను తీసుకొచ్చి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.

హైదరాబాద్‌లో వ్యక్తులను బట్టి ఈ ఇంజక్షన్‌ 15 వేల నుంచి 40 వేల వరకు విక్రయిస్తున్నారని సమాచారం. అక్కడి నుంచి ఒంగోలుకు తీసుకొచ్చి 80 వేలకు, ఇంకా డిమాండ్‌ ఉంటే లక్షా ఇరవై వేలకు అమ్ముతున్నారు. ఇలా ఒంగోలులో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్‌ బంధువుకు ఈ ఇంజక్షన్‌ కోసం ఓ బ్రోకర్‌ బేరం కుదుర్చుకున్నాడు… ఇంజక్షన్‌ 80 వేలకు విక్రయించేందుకు ఒప్పందం కుదిరింది. దీంతో ఆ కానిస్టేబుల్‌ ఇంజక్షన్‌ కోసం 80 వేల రూపాయల డబ్బు తీసుకుని వచ్చాడు. తీరా ఇంజక్షన్‌ చేతిలో పెట్టే సమయానికి ఇంజక్షన్‌ ధర పెరిగిందని, లక్షా 20 వేలు చెల్లించాలని ఆ బ్రోకర్‌ డిమాండ్ చేశాడు… దీంతో కోపంతో రగిలిపోయిన ఆ కానిస్టేబుల్‌ బ్రోకర్‌ చొక్కా పట్టుకుని పెద్ద పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు గుమిగూడారు. దీంతో ఆ బ్రోకర్‌ అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ సంఘటనతో కరోనా ఇంజక్షన్‌ పేరు చెప్పి దోపిడీ చేస్తున్న బ్రోకర్ల ఉదంతం వెలుగులోకి వచ్చింది.

ఒంగోలు రిమ్స్‌ బాధితుల అవసరాలను ఆసరాగా చేసుకున్న కొంతమంది దళారులు వారికి ఏం కావాలన్నా బ్లాక్‌ మార్కెట్లో చిటికెలో ఏర్పాటు చేసేలా పటిష్ట నెట్‌వర్క్ టీమ్ పనిచేస్తోందని స్థానికులు చెబుతున్నారు. రిమ్స్‌లోని క్యాంటీన్ కేంద్రంగా ఈ దళారులు తిష్టవేసి బాధితులకు ఏ అవసరం వచ్చినా, డబ్బులు తీసుకుని సమకూరుస్తున్నారని సమాచారం. తాజగా ఈ ఇంజక్షన్‌ దందా వ్యవహారం రచ్చకెక్కడంతో దీని వెనకాల ఎంతమంది ఉన్నారనే వివరాలను సేకరించే పనిలో పడ్డారు పోలీసులు.