Eta Variant Coronavirus in Karnataka: కరోనా కాదిప్పుడు. కొత్త రకం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. వివిధ దేశాలకు వ్యాపిస్తోంది. ఇండియాలో తొలిసారిగా కరోనా వేరియంట్లలో ఒకటైన ఇటా వే రియంట్… కర్ణాటకలోని మంగళూరులో ఓ వ్యక్తిలో బయటపడింది. ఇండియాలో ఉన్న కరోనా వైరస్‌లలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో తెలుసుకునేందుకు ఇప్పుడు తరచుగా… జీనోమ్ సీక్వెన్సింగ్ (జన్యు మార్పుల అధ్యయనం) చేస్తున్నారు. ఈ క్రమంలో… ఈ వేరియంట్ బయటపడింది.
ప్రపంచదేశాల్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు కొత్త రూపు దాల్చి భయపెడుతోంది. కొత్త కరోనా వైరస్ అప్పుడే దేశాలకు విస్తరిస్తోంది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదకర వైరస్‌గా గుర్తించారు. కర్ణాటకలోని ఓ ల్యాబ్‌లో జరిపిన అధ్యయనంలో ఇది వెలుగులోకి వచ్చింది. ఇటా వేరియంట్ కలిగివున్న వ్యక్తి… దక్షిణ కర్ణాటకలోని మూడబిద్రేకు చెందినవాడు. 4 నెలల కిందట దుబాయ్ నుంచి వచ్చాడు. అప్పుడు అతనికి కరోనా లక్షణాలు ఉండటంతో… టెస్టు చేసారు. కరోనా పాజిటివ్ అని తేలింది. తర్వాత రికవరీ అయ్యాడు. అయితే.. ఇప్పుడు జీనోమ్ సీక్వెన్సింగ్ అధ్యయనం ద్వారా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 4 నెలల కిందట అతనికి ఇటా కరోనా వేరియంట్ సోకింది. ఆ సమయంలో అతను దాదాపు 100 మందిని కలిశాడు. వారిలో ఎవరిలో ఎవరికైనా ఈ వేరియంట్ చేరిందా అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఈ వేరియంట్‌పై మరింత పరిశోధన కోసం శాంపిల్స్‌ని పంపినట్లు కర్ణాటక వైద్య, ఆరోగ్య తెలిపింది.
నిజానికి ఇటా వేరియంట్ ఇదేమీ కొత్త వేరియంట్ కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. 2020లోనే వెలుగలోకి వచ్చింది. ఇప్పటివరకూ పెద్దగా పరిశోధనలు జరగలేదు. తొలిసారి బ్రిటన్, నైజీరియాలో ఈ రకం వేరియంట్ బయటపడింది. ఎక్కువ కేసులు నైజీరియాలో నమోదయ్యాయి. దీన్ని B.1.525 అని పిలుస్తున్నారని నిపుణులు పేర్కొన్నారు. ఇది డెల్టా వేరియంట్ అంత వేగంగా ఇది వ్యాప్తి చెందలేదనే అభిప్రాయపడ్డారు. ఈ రకం వైరస్ ఈ సంవత్సరం మార్చి 5 నాటికి ఇది 23 దేశాలకు విస్తరించి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. దీనిపై మరిన్ని పరిశోధనలు చేస్తే తప్ప.. ఇది ఎంతవరకూ ప్రమాదకరం… లేక… భవిష్యత్తులో ఇది మరింతగా వ్యాప్తి చెందగలదా అన్నది తెలిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
ఇదిలావుంటే, కొత్త వేరియంట్ ఈటా వెలుగుచూడటంతో హెల్త్ డిపార్ట్‌మెంట్ అప్రమత్తమైంది. ఈ వైరస్ వ్యాప్తిని ట్రేస్ చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతానికి ఆ దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తి ఎవర్ని కలిశాడు, వాళ్లు ఎక్కడెక్కడ ఉన్నారో ట్రేసింగ్ చేస్తున్నారు. వాళ్లలో ఎవరికైనా కరోనా సోకితే… అది ఇప్పుడు వారిలో లేకపోయినా… వారి నుంచి జీనోమ్ శాంపిల్స్ సేకరించి… అధ్యయనం చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఇటా వేరియంట్ కూడా వేగంగా వ్యాపించే రకమే అయితే.. ఇప్పటికే అది కర్ణాటకలో చాలా మందికి వ్యాపించే ఉంటుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలావుంటే దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మెల్ల మెల్లగా విస్తరిస్తోంది. కొత్తగా 44,643 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 3,18,56,757కి చేరింది. దేశంలో కరోనాతో కొత్తగా 464 మంది ప్రాణాలను కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,26,754కి చేరింది. మరణాల రేటు 1.3 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో ఇది 2.12 శాతంగా ఉంది. కాగా, దేశంలో కొత్తగా 41,096 మంది రికవరీ అయ్యారు. మొత్తం రికవరీల సంఖ్య 3,10,15,844కి చేరింది. రికవరీ రేటు 97.4 శాతంగా ఉంది. ప్రస్తుతం భారత్ వ్యాప్తంగా 4,14,159 యాక్టివ్ కేసులు ఉన్నాయి.