దేశంలో కరోనా డేంజర్‌బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకూ కోవిడ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో 39 మంది కరోనా బారిన పడి కన్నుమూశారు. మహారాష్ట్రలో 18 మంది, ఉత్తరప్రదేశ్‌లో ఆరుగురు, గుజరాత్‌లో నలుగురు, మధ్యప్రదేశ్‌లో ముగ్గురు, ఢిల్లీలో ఇద్దరు, కర్ణాటకలో ఇద్దరు, తెలంగాణలో ఒకరు, తమిళనాడులో ఒకరు, పంజాబ్‌లో ఒకరు, మేఘాలయాలో ఒకరు మృతిచెందారు. కొత్తగా 1,118 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తిని పరిశీలించగా..
ఏపిలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రంనుంచి బుధవారం రాత్రి 7 గంటల వరకు కొత్తగా 42 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 525కు చేరింది. బుధవారం కొత్తగా కర్నూలు జిల్లాలో 19 కేసులు, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో 8 కేసుల చొప్పున, కడప జిల్లాలో 3, నెల్లూరు జిల్లాలో 2, అనంతపురం, కృష్ణా జిల్లాల్లో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి. కాగా, నలుగురు కోలుకుని డిశ్చార్చి అయ్యారు. వైరస్ కారణంగా ఐదుగురు మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 14కు చేరగా, కోలుకుని డిశ్చార్జి అయినవారి సంఖ్య 20కి చేరింది.
కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లోనూ పడకల సంఖ్య పెంచుతూ, ఐసోలేషన్ వార్డులను అందుబాటులోకి తెచ్చారు. కాకినాడ, కర్నూలు, విశాఖపట్నం, విజయవాడ ప్రభుత్వాసుపత్రుల్లో ఇప్పటి వరకూ 45 ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశారు. నిర్మాణ దశలో మరో 90 వార్డులు ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. ఇక అత్యధికంగా కరోనా పాజిటివ్ 122 కేసులు నమోదైన జిల్లాగా గుంటూరు టాప్‌లో ఉంది. కర్నూలు జిల్లాలో 110, నెల్లూరు జిల్లాలో 58, కృష్ణా జిల్లాలో 45 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 491 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
తెలంగాణకు కరోనా కాస్త ఊరట నిచ్చిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే, బుధవారం రాష్ట్రవ్యాప్తంగా కేవలం 6 కొత్త కేసులే నమోదయినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. మరో 8 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని తెలిపింది. మొత్తంగా తెలంగాణలో ఇప్పటి వరకు 650 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 118 మంది కోలుకోగా.. 18 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 514 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 514 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారిక సమాచారం. అయితే, ఇందులో కేవలం ఒక్క హైదరాబాద్‌లోనే 267 పాజిటివ్ కేసులు నమోదుకావడం గమనార్హం.