తెలంగాణ‌లో పెరిగిన క‌రోనా కేసులు…వైర‌స్ ఫ్రీ జిల్లాలు

తెలంగాణ‌లో గ‌త మూడు, నాలుగు రోజులుగా త‌గ్గుముఖం ప‌ట్టిన క‌రోనా కేసులు గురువారం స్వ‌ల్పంగా పెరిగాయి. కొత్త‌గా 22 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, ముగ్గురు మ‌ర‌ణించారు. ఈ మేర‌కు రాష్ట్ర ఆరోగ్య శాఖ  హెల్త్ బులిటెన్ విడుద‌ల చేసింది. కొత్త‌గా న‌మోదైన కేసుల‌తో క‌లిసి రాష్ట్రంలో క‌రోనా సోకిన వారి సంఖ్య మొత్తం 1038కి పెరిగింది. క‌రోనా కార‌ణంగా చ‌నిపోయిన వారి సంఖ్య 28కి చేరింది. ప్ర‌స్తుతం 568 యాక్టివ్ కేసులు ఉండ‌గా, ఇప్ప‌టి […]

తెలంగాణ‌లో పెరిగిన క‌రోనా కేసులు...వైర‌స్ ఫ్రీ జిల్లాలు

Updated on: May 01, 2020 | 6:58 AM

తెలంగాణ‌లో గ‌త మూడు, నాలుగు రోజులుగా త‌గ్గుముఖం ప‌ట్టిన క‌రోనా కేసులు గురువారం స్వ‌ల్పంగా పెరిగాయి. కొత్త‌గా 22 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, ముగ్గురు మ‌ర‌ణించారు. ఈ మేర‌కు రాష్ట్ర ఆరోగ్య శాఖ  హెల్త్ బులిటెన్ విడుద‌ల చేసింది. కొత్త‌గా న‌మోదైన కేసుల‌తో క‌లిసి రాష్ట్రంలో క‌రోనా సోకిన వారి సంఖ్య మొత్తం 1038కి పెరిగింది. క‌రోనా కార‌ణంగా చ‌నిపోయిన వారి సంఖ్య 28కి చేరింది. ప్ర‌స్తుతం 568 యాక్టివ్ కేసులు ఉండ‌గా, ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 442కు చేరింది.  అయితే, కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల‌న్నీ ఒక్క హైద‌రాబాద్‌కు చెందిన‌విగా అధికారులు వెల్ల‌డించారు.

ఇక‌, రాష్ట్రంలో హైద‌రాబాద్ మిన‌హా ఇత‌ర జిల్లాల్లో కొత్త కేసులు న‌మోదుకావ‌డం లేద‌ని అధికారులు గుర్తించారు. దాంతో పాటు ఇప్ప‌టికే త‌క్కువ కేసులు న‌మోదైన జిల్లాల్లో క‌రోనా రోగులంద‌రూ కోలుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయా జిల్లాల్లో ప్ర‌స్తుతం సున్నా క‌రోనా యాక్టివ్ కేసులున్నాయి. ప్ర‌స్తుతం క‌రోనా కేసులు లేని జిల్లాలు రాష్ట్రంలో 13కు పెరిగాయ‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు. వీటిలో మూడు జిల్లాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క క‌రోనా కేసు కూడా న‌మోదు కాలేదు. మిగిలిన 10 జిల్లాల్లో క‌రోనా రోగులంద‌రూ డిశ్చార్జి కావ‌డంతో క‌రోనా యాక్టివ్ కేసుల సంఖ్య సున్నాగా ఉంది. 
వ‌రంగ‌ల్ రూర‌ల్‌, యాదాద్రి భువ‌న‌గిరి, వ‌న‌ప‌ర్తి జిల్లాలు ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క క‌రోనా కేసు కూడా న‌మోదు కాని జిల్లాలుగా ఉన్నాయి. ఇక‌.. సిద్దిపేట, మహబూబాబాద్, మంచిర్యాల, నారాయణపేట, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్, ములుగు, సంగారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో క‌రోనా నుంచి కోలుకుని యాక్టివ్ క‌రోనా కేసులు లేని జిల్లాలుగా నిలిచాయి. వీటితో పాటు గ‌త రెండు వారాలుగా కొత్త‌గా కేసులు న‌మోదు కాని జిల్లాలుగా క‌రీంన‌గ‌ర్‌, కామారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, మెద‌క్‌, భూపాల‌ప‌ల్లి జిల్లాల్లో కొత్త కేసుల సంఖ్య పూర్తిగా త‌గ్గుముఖం ప‌ట్టింది.