హైదరాబాద్‌లోని కింగ్ కోఠి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితుడు తప్పించుకున్నాడనే వార్త నగరంలో ఇటీవల కలకలం రేపింది. అయితే, ఎట్టకేలకు అధికారులు అతడి ఆచూకీ తెలుసుకుని తిరిగి ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే…
వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలానికి చెందిన ఓ వ్యక్తి గత కొంత కాలంగా హైదరాబాద్‌లోని ఓ వృద్ధాశ్రమంలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు కరోనా బారిన పడ్డాడు. చికిత్స కోసం జూన్ 15న కింగ్ కోఠి ఆస్పత్రిలో చేరాడు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం ఆస్పత్రి నుంచి తప్పించుకున్నాడు. ఎల్బీ నగర్‌లో ఆర్టీసీ బస్సు ఎక్కి సూర్యాపేట వెళ్లాడు. అక్కడ మరో బస్సెక్కి తొర్రూర్ వెళ్లినట్లు అధికారులు గుర్తించారు.
ఈ క్రమంలో బాధితుడు తన తమ్ముడికి ఫోన్ చేసిన తాను ఇంటికి వస్తున్నట్లుగా చెప్పడంతో అతడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అలెర్ట్ అయిన వైద్య సిబ్బంది, పోలీసులు కరోనా సోకిన వ్యక్తి తొర్రూరు బస్టాండ్‌కు చేరుకోగానే అదుపులోకి తీసుకున్నారు. అతడికి వెంటనే పీపీఈ కిట్ తొడిగించి అంబులెన్స్‌లో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు అతడు ప్రయాణించిన బస్సులో ఉన్నతోటి ప్రయాణికులపై ఆరా చేపట్టారు.