ఎంతో అందంగా ఉండే తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ, ఇప్పుడు కరోనా కోరల్లో చిక్కుకుంది. కోనసీమలో మళ్లీ కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. రాష్ట్రం అంతా పాజిటివ్ కేసులు తగ్గినా, కోనసీమ ప్రాంతంలో మాత్రం కేసులు పెరుగుతున్నాయి. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. కరోనా నివారణ చర్యలు చేపట్టారు. కొవిడ్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. థర్డ్ వేవ్ బారిన పడకుండా ప్రజలకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. గతంలోనే ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని పోలీసులు గుర్తుచేస్తున్నారు. అధికారులు చాలా చోట్ల కర్ఫ్యూ సమయాన్ని పెంచారు. పాజిటివిటీ రేటు కూడా పెరుగుతుండటంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పలు చోట్ల ఇంకా కఠినంగా ఆంక్షలు పెట్టారు. చేబ్రోలు మండలంలో ఉదయం ఆరు నుంచి ఉదయం పది వరకే ఆంక్షలను సడలించారు. రాజోలు, అల్లవరం, పి.గన్నవరం, ఆత్రేయపురంలో మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే కార్యకలాపాలకు అనుమతి ఉంది. ఆంక్షలు అమలు చేస్తోన్న ప్రాంతాలలో మధ్యాహ్నం రెండు గంటల తర్వాత షాపులు తెరిచి ఉన్నా, అనవసరంగా ఎవరైనా బయట తిరిగినా కఠినచర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీచేశారు.
ప్రభుత్వం కూడా కరోనా కేసుల పెరుగుదలపై సీరియస్‌గా ఫోకస్ పెట్టింది. కొవిడ్‌పై ఇటీవల సీఎం జగన్ చేసిన రివ్యూలోనూ అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. నిర్లక్ష్యంగా ఉండొద్దని థర్డ్ వేవ్ వచ్చినా సమర్ధంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. మరోవైపు కొత్తగా ఏర్పాటు చేసే ఆసుపత్రులు, ఆక్సిజన్ ప్లాంట్లపైనా ముఖ్యమంత్రి జగన్ ఆరా తీశారు. వీలైనంత తొందరగా ఆ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపుతుందన్న అంచనాల నేపథ్యంలో, వైద్యులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆసుపత్రుల్లో ఏ లోటు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
Also Read: బాంబ్ పేల్చిన ఆర్ కృష్ణయ్య.. హుజూరాబాద్ బరిలో 1000 మంది..!