ఒకప్పుడు యావత్ ప్రపంచాన్నే గడగడలాడించిన అండర్ వరల్డ్ డాన్‌లకే.. ఇప్పుడు ముచ్చెమటలు పట్టిస్తోంది కరోనా మహమ్మారి. తీహార్ జైల్లో హై సెక్యూరిటీ సెల్ లో ఉన్న అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్‌ను కరోనా కాటేసింది. అయితే ప్రస్తుతం రాజన్ జైలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని.. అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు జైలు అధికారులు. గత కొద్ది రోజులుగా తీవ్ర జ్వరం, దగ్గు వంటి లక్షణాలతో చోటా రాజన్ కనిపించడంతో.. అతడికి కరోనా పరీక్ష చేయించారు జైలు అధికారులు. దీంతో రాజన్‌కు కరోనా సోకినట్లు నిర్దారించారు వైద్యులు. అతనికి కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చిన తర్వాత, అక్కడ హై సెక్యూరిటీ సెల్ వద్ద విధుల్లో ఉన్న భద్రతా సిబ్బందికి కరోనాపరీక్షలు నిర్వహించి హోం ఐసోలేషన్ కు వెళ్ళమని ఆదేశించారు .
సాయుధ పోలీసుల పర్యవేక్షణలో రాజన్‌కు చికిత్స అందిస్తున్నామని జైలు అధికారులు తెలిపారు. తీహార్ జైల్లో వేల సంఖ్యలో ఖైదీలు ఉంటారనే విషయం తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైనప్పటి నుంచి తీహార్ జైల్లో కూడా ఖైదీలు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు.