Covid-19 Care Centre: దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. నిత్యం నాలుగు లక్షలకుపైగా కేసులు నమోదవుతుండగా.. నాలుగువేల మందికిపైగా ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. దీంతో ఆసుపత్రుల్లో బెడ్లు లేక, ఆక్సిజన్ లేక బాధితులంతా సతమతమవుతున్నారు. దీంతో ప్రభుత్వాలకు తోడు స్వచ్చంద సంస్థలు కూడా రోగుల కోసం కష్టపడుతున్నాయి. ఆధ్యాత్మిక సంస్థలు సైతం విస్తృతంగా సేవలు చేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ నగరంలోనూ ఓ చర్చి కోవిడ్ కేర్ సెంటర్‌గా మారింది.
హైదరాబాద్‌లోని ప్రఖ్యాత కల్వరి టెంపుల్ చర్చిని 300 బెడ్లతో కోవిడ్ సెంటర్ కొవిడ్ కేర్ సెంటర్‌గా అభివృద్ది చేశారు. మియాపూర్‌లోని కల్వరీ టెంపుల్ ప్రాంగణంలో అంకురా, థెరిస్సా ఆస్పత్రుల సౌజన్యంతో 300 పడకలు, 50 ఆక్సిజన్ బెడ్లతో కోవిడ్ సెంటర్‌ను ఏర్పాటు చేయగా.. దీనిని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. కరోనా రోగుల కోసం కల్వరి టెంపుల్ చర్చి వ్యవస్థాపకుడు బ్రదర్ సతీశ్ కుమార్ చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు.
కల్వరీ టెంపుల్ వ్యవస్థాపకుడు, పాస్టర్ డాక్టర్ పి సతీష్ కుమార్ మాట్లాడుతూ.. దేశం కఠినమైన స్థితిలో ఉందని.. కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా, ప్రతి వ్యక్తి అవసరం ఉన్న వారికి సహాయం చేయాలని సూచించారు. అన్ని కల్వరి టెంపుల్‌లను కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చాలనే లక్ష్యంతో ప్రారంభించినట్లు వెల్లడించారు. కోవిడ్ పాజిటివ్‌గా పరిక్షించిన వారికి వైద్య సహాయం అందిస్తామని తెలిపారు. అంబులెన్సులు, ఆక్సిజన్ సౌకర్యం ఉందన్నారు. హైదరాబాద్‌లోని కల్వరి టెంపుల్‌కి 1000 పడకల సామర్థ్యం ఉందని పేర్కొన్నారు.
Also Read: