Black fungus death in Kamareddy : కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకుని బయటపడిన కొందరిపై బ్లాక్ ఫంగస్ అనే మరో మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఇవాళ కామారెడ్డి జిల్లాలో బ్లాక్ ఫంగస్ మరణం నమోదవడం సంచలనం రేపింది. రామారెడ్డి మండలం గిద్ద గ్రామానికి చెందిన గురజాల అంజల్ రెడ్డి (42) బ్లాక్ ఫంగస్ తో మృతి చెందారు. గత నెల 22న జ్వరం రావడంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు అంజల్ రెడ్డి. కరోనా పాజిటివ్ రావడంతో ఈ నెల 23వ తేదీన నిజామాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి అంజల్ రెడ్డి చికిత్స తీసుకున్నారు. నిజామాబాద్ ఆస్పత్రిలోనే 12 రోజుల పాటు చికిత్స పొందిన అంజల్ రెడ్డి.. తర్వాత తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆయన్ను ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బ్లాక్ ఫంగస్ కారణంగా ఈనెల 11వ తేదీన అంజల్ రెడ్డికి సంబంధించిన దవడ, కన్నును తొలగించారు వైద్యులు. అయినప్పటీకీ అతని ప్రాణాలు కాపాడలేకపోయారు. ఇవాళ అంజల్ రెడ్డి హైదరాబాద్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు.