Bharat Biotech: దేశంలో కరోనావైరస్ కట్టడికి వ్యాక్సినేషన్ డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో.. భారత్ బయోటెక్ వ్యాక్సిన్.. కోవాగ్జిన్ ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు భారత్ బయోటెక్ క్లినికల్ ట్రయల్స్ తుది ఫలితాలను శనివారం ప్రకటించింది. ట్రయల్స్‌లో టీకా తీవ్రమైన, మితమైన కేసుల్లో 77.8 శాతం సామర్థ్యాన్ని చూపిందని భారత్ బయోటెక్ వెల్లడించింది. తీవ్రమైన కేసులకు వ్యతిరేకంగా 93.4 శాతం ప్రభావవంతంగా ఉన్నట్లు తెలిపింది. మూడో దశ ట్రయల్స్‌లో కొన్ని రోజుల నుంచి ప్రపంచాన్ని వణికిస్తున్న B.1.617.2 (డెల్టా), B.1.351 (బీటా) వేరియంట్‌లకు వ్యతిరేకంగా 65.2 శాతం సమర్థతను ప్రదర్శించిందని భారత్ బయోటెక్ ప్రకటించింది.
కోవాగ్జిన్ తీవ్ర లక్షణాలు అరికట్టి హాస్పిటలైజేషన్‌ను తగ్గిస్తోందని భారత్ బయోటెక్ తెలిపింది. కోవ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ ఫలితాలను భారత్ బయోటెక్ మెడ్‌జివ్‌లో ప్రచురించింది. భారత్ లో గత కొంతకాలం నుంచి జరిగిన అతిపెద్ద ట్రయల్‌లో కొవాగ్జిన్ వ్యాక్సిన్ సురక్షితమైందని రుజువైందని కంపెనీ పేర్కొంది. నవంబర్ 16, 2020 నుంచి జరిగిన మూడో దశ ట్రయల్స్‌లో 25,798 మంది పాల్గొని మొదటి డోస్ తీసుకున్నారు. అలాగే.. జనవరి 7, 2021న 24,419 మంది రెండో డోసు తీసుకున్నారు. 146 రోజుల పాటు జరిగిన ట్రయల్స్‌లో వ్యాక్సిన్ వేసుకున్న వారిని వైద్య నిపుణులు నిశితంగా పరిశీలించారు.
ఈ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ పూర్తి చేయడం ద్వారా.. అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా కరోనా వ్యాక్సిన్‌ను తయారు చెయ్యగలవని నిరూపించినట్లయిందని భారత్ బయోటెక్ ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు. ట్రయల్స్‌లో తమ వ్యాక్సిన్ మెరుగైన ఫలితాలను చూపించిందని పేర్కొన్నారు.
ఫార్మా దిగ్గజం.. భారత్ బయోటెక్ కంపెనీ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం టీకా డ్రైవ్‌లో భాగంగా అత్యవసర వినియోగం కింద వ్యాక్సిన్ ను దేశవ్యాప్తంగా వినియోగిస్తున్నారు. టీకా డ్రైవ్‌లో కొవాగ్జిన్ కీలకంగా మారింది.
Also Read: