ఏపీలో కరోనా మహమ్మారి కల్లోలం క్రియేట్ చేస్తోంది. భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. కర్ఫ్యూ నియమ నిబంధనలు ఎన్ని అమలు చేస్తున్నప్పటికీ వ్యాధి వ్యాప్తి అదుపులోకి రావడం లేదు. బెడ్లు, ఆక్సిజన్ కొరత కలవరపెడుతోంది. మనసును కన్నీరు పెట్టించే ఘటనలు రోజు అనేకం నమోదవుతున్నాయి. ఈ క్రమంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్సిజన్ కోసం భారీగా నిధులు కేటాయించింది. ఆక్సిజన్ సంబంధిత కొనుగోళ్ళకు పరిపాలన అనుమతులు జారీ చేసింది. 309.87 కోట్లతో పరిపాలన అనుమతులు జారీ చేసింది ఏపీ సర్కార్.
ఈ నిధులలో రాష్ట్రంలో 49 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు ఏర్పాటు కోసం 180.19 కోట్ల రూపాయలు కేటాయించింది. ప్లాంట్ల ఏర్పాటుకు సివిల్, ఎలక్ట్రికల్ పనుల కోసం 25.80 కోట్ల రూపాయలకు పరిపాలన అనుమతులు ఇచ్చింది. 10 వేల అదనపు ఆక్సిజన్ పైప్ లైన్ల ఏర్పాటుకు 50 కోట్లు మంజూరు చేసింది. 50 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్ల కొనుగోలుకు 46 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఆరు నెలల పాటు ఆక్సిజన్ పైప్ లైన్ల రిపేర్, మెయింటెనెన్స్ కోసం ప్రతి జిల్లాకు 60 లక్షలు మంజూరు చేసింది.