ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..స్టేట్ కోవిడ్ ఆస్పత్రిగా సర్వజన వైద్యశాల

|

Jul 08, 2020 | 6:46 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ దెబ్బకు ప్రజలు, అధికార యంత్రాంగం హడలెత్తిపోతున్నారు. గత నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితిలో ఎలాంటి మార్పు రావడం లేదు. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. ఇటువంటి తరుణంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..స్టేట్ కోవిడ్ ఆస్పత్రిగా సర్వజన వైద్యశాల
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ దెబ్బకు ప్రజలు, అధికార యంత్రాంగం హడలెత్తిపోతున్నారు. గత నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితిలో ఎలాంటి మార్పు రావడం లేదు. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. రోజుకు వెయ్యికి పైగానే పాజిటివ్ కేసులు బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 22259కు చేరింది. కాగా, అత్యధికంగా కర్నూలు జిల్లాలో మొత్తం 2722 పాజిటివ్ కేసులు.. తర్వాత అనంతపురం జిల్లాలో కేసులు 2568కు చేరాయి. గుంటూరు జిల్లాలో 2435 కేసులు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

కర్నూలు జిల్లాలో కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను స్టేట్‌ కోవిడ్‌ ఆస్పత్రిగా మార్చింది. ఇక్కడ కేవలం కరోనా రోగులకు మాత్రమే చికిత్స అందించే విధంగా ఏర్పాట్లు చేశారు. అవసరమైన వైద్యులు, సిబ్బందిని, వైద్యపరికరాలను, సౌకర్యాలను సైతం ఏర్పాటు చేసింది.  కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్యతో పాటు మృతుల సంఖ్యను బట్టి చూస్తే రాష్ట్రంలోనే జిల్లా అగ్రస్థానంలో ఉంది.  కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు శాంతిరామ్‌ జిల్లా కోవిడ్‌ ఆస్పత్రి, విశ్వభారతి జిల్లా కోవిడ్‌ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం ఏర్పాట్లు చేసినా.. మరణాలన్నీ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోనే నవెూదయ్యాయి. దీంతో దీనిని కోవిడ్‌ ఆస్పత్రిగా మార్చారు.

ఆస్పత్రిలో రోజూ 4 నుంచి 6 దాకా కరోనా వైరస్‌ వల్ల మరణాలు సంభవిస్తుండటం, రాష్ట్రంలోనే కర్నూలు జిల్లాలో మరణాల సంఖ్య అధికంగా ఉండటంతో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ మేరకు జిల్లా అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆస్పత్రి అధికారులు, వైద్యులతో జిల్లా కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ సమావేశమయ్యారు. కరోనా రోగుల వద్దకు వైద్యులు వెళ్లడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.