AP Ambulance Stopped: ఆంధ్రా తెలంగాణ సరిహద్దులో ఏపీ అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు మళ్లీ నిలిపేస్తున్నారు. దీంతో కర్నూలు జిల్లా సరిహద్దులోని పుల్లూరు చెక్‌పోస్టు వద్ద అర్ధరాత్రి తర్వాత నుంచి పెద్ద ఎత్తున అంబులెన్స్‌లు నిలిచిపోయాయి. హైదరాబాద్ ఆస్పత్రుల నుంచి బెడ్ అనుమతి పత్రం, తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన ఈ పాస్ ఉంటేనే అనుమతిస్తామని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో సుమారు 20 అంబులెన్స్‌లు పుల్లూరు చెక్‌పోస్టు వద్ద నిలిచిపోయాయి. మరోవైపు సూర్యాపేట జిల్లా రామాపురం క్రాస్ రోడ్డు వద్ద కూడా ఏపీ అంబులెన్స్‌లను నిలిపేస్తున్నారు. రోగులతో వస్తున్న అంబులెన్స్‌లను అడ్డుకోవడంతో వారి బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనుమతులున్నా ఆపేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
మీ వారి పరిస్థితి విషమించింది.. హైదరాబాద్‌లో పెద్ద ఆస్పత్రులు ఉన్నాయి. మంచి చికిత్స దొరుకుంది. తొందరగా వెళ్లండి అంటే.. హడావుడిగా అంబులెన్స్ మాట్లాడుకుని.. బయలుదేరుతున్నారు కరోనా బాధితులు. కానీ, తెలంగాణ సరిహద్దుల్లో వారికి యమగండం ఎదురవుతోంది. ప్రభుత్వాల ఆంక్షలు.. అధికారుల నిబంధనలే వారి పాలిట శాపంగా మారుతున్నాయి. ఫలితంగా కర్నూలు టోల్‌ప్లాజా దగ్గర ఇవాళ ఇద్దరు కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ దారుణానికి బాధ్యులెవరు. ఎవరిని నిందించాలి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సరిహద్దు వరకూ వచ్చిన వారితో ఇలానా వ్యవహరించేది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనా రాజకీయాలు చేసేది. కొంచెమైనా ప్రభుత్వాలు మానవత్వాన్ని ప్రదర్శించక్కర్లేదా. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడుకుని ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం లేదా.. ఇది అత్యవసర సమస్య కాదా. ఇరు రాష్ట్రాల సీఎస్‌ల మధ్య సమన్వయం ఎక్కడ లోపిస్తోంది.
ఆంధ్ర వైపు నుంచి కర్నూలు మీదుగా తెలంగాణలోకి వెళ్లే అంబులెన్సులను సరిహద్దు టోల్ ప్లాజా వద్ద తెలంగాణలోకి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఇద్దరు పేషెంట్లు మృతిచెందారు. అధికారులు అడ్డుకోవడం వల్లే చనిపోయారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి.
తెలంగాణ అధికారులు వెనక్కి పంపిన అంబులెన్స్‌లతో పుల్లూర్ టోల్ ప్లాజా వద్దకు చేరుకున్నారు కర్నూలు ఎమ్మెల్యే ఆసిఫ్ ఖాన్. తెలంగాణలోకి అంబులెన్స్‌లు అనుమతించాలని అధికారులను కోరారు. రోగులకు అత్యవసర చికిత్స అందాల్సి ఉందన్నారాయన. అయితే సరైన పత్రాలు ఉంటే పంపాలని తమకు ఆదేశాలు ఉన్నాయంటూ ఎమ్మెల్యేకు సమాధానమిస్తున్నారు పోలీసులు. దీంతో అన్ని అనుమతులు ఉన్నాకే హైదరాబాద్ బయల్దేరాలని రోగుల బంధువులకు ఎమ్మెల్యే సూచించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నవారిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి ఎమ్మెల్యే పంపించారు.
ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే కోవిడ్ పేషెంట్లపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ప్రత్యేకమైన గైడ్‌లైన్స్ విధిస్తూ సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆస్పత్రుల అనుమతి లేని పేషెంట్లకు తెలంగాణలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. వైద్యం కోసం తెలంగాణకు వచ్చేవారికి బెడ్ కన్‌ఫర్మేషన్ తప్పనిసరిగా ఉండాలి. అనుమతులు లేకుండా వచ్చి పేషెంట్లు ఇబ్బందులు పడొద్దని సూచిస్తున్నారు అధికారులు. ఈ విషయమై అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లెటర్ కూడా రాశారు.
Read Also… Sputnik V: గుడ్ న్యూస్.. మరో వారంలో స్పుత్నిక్-వి వ్యాక్సిన్ అందుబాటులోకి.. ధర ఎంతో తెలుసా.?