ఏపీలో ఈ నెలాఖరు వరకు రాత్రి కర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొవిడ్ నిబంధనల మేరకు రాత్రి 12 నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ ఉంటుంది. కర్ఫ్యూ వేళలపై వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను సమీక్షించిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ కర్ఫ్యూ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే విపత్తుల నిర్వహణ చట్టం 2005, భారత శిక్షా స్మృతి (IPC) సెక్షన్ 188, ఇతర నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గినప్పటికీ.. పండుగల సీజన్, థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఏపీలో కరోనా వివరాలు ఇలా
ఏపీలో కరోనా వైరస్ కేసుల తీవ్రత తగ్గింది. కొత్తగా 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 38,786 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 517 మందికి వైరస్ సోకినట్లు తేలింది. కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు చొప్పున, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు విడిచారు. ఇదే సమయంలో 826 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. కాగా రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,58,582కు చేరుకుంది. రికవరీ కేసులు 20,37,691కు పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 6,615 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో 97 తూర్పు గోదావరిలో 88, గుంటూరులో 84 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Also Read: నిన్న అదృశ్యమైన 8 ఏళ్ల బాలుడు తేజసాయిరెడ్డి హత్య.. పొలాల్లో మృతదేహం
కార్పొరేటర్ భర్తను చెప్పుతో చెడామడా వాయించిన మహిళ… ఎందుకో తెలిస్తే షాకే