Astrazeneca Oxford vaccine: ఆస్ట్రాజెనెకా – ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్ కోవిషీల్డ్ టీకా మొదటి డోసుకు రెండో డోసుకు నడుమ 45 వారాలు తేడా ఉంటే ఇంకా బాగా పనిచేస్తుందని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తెలిపింది. రెండో డోసు వేసుకున్న ఆరు నెలల తర్వాత మూడో డోసు వేసుకుంటే యాంటీబాడీస్ సంఖ్య గణనీయంగా పెరుగుతుందని తమ అధ్యయనంలో వెల్లడైనట్టు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వెల్లడించింది. తమ అధ్యయనంలో.. మొదటి డోసుకు రెండో డోసుకు నడుమ 10 నెలల (315 రోజులు) తేడా ఉంటే.. అద్భుతమైన ఫలితం కనిపించిందని తెలిపింది. అయితే.. ఈ అధ్యయనం ఇంకా ఏ జర్నల్‌లోనూ ప్రచురితం కాలేదు. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా టీకాతో రక్తం గడ్డకట్టడం, సైడ్ ఎఫెక్ట్స్ వంటి దుష్ప్రభావలు కనిపిస్తుండడంతో.. దానిపై ఇప్పటికే చాలా దేశాలు ఆంక్షలు విధించాయి. కొన్ని దేశాలు పరిమితంగా వినియోగిస్తున్నాయి. యూకేలోనే మొదటి డోసు ఆక్స్‌ఫర్డ్ టీకా వేసిన చాలా మందికి రెండో డోసు కింద ఫైజర్ వ్యాక్సిన్ అందించారు. ఫ్రాన్స్, ఇటలీ, కొన్ని స్కాండినేవియన్ దేశాలు కూడా ఇదే పద్ధతిని పాటిస్తున్నాయి. ఇలాంటి సమయంలో.. తమ టీకా కోవిషీల్డ్ మూడో డోసు వేసుకుంటే మంచిదని ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ పరిశోధకుడు ఆండ్రూ పొలార్డ్ ప్రకటించడం గమనార్హం.
కరోనా వ్యాక్సిణ్ సరఫరా లేమితో సతమతమవుతున్న దేశాలకు తాజా ఫలితాలు మేలు కలిగించే విషయమని తెలిపారు. అయితే.. వ్యాక్సినేషన్ గురించి మాట్లాడుతూ.. ఆయన మూడో డోసు అవసరమయ్యే అవకాశముందని పొలార్డ్ తెలిపారు. మరో పరిశోధకురాలు థెరిసా లాంబే మాట్లాడుతూ.. ప్రస్తుతం వెలుగులోకి వస్తున్న వేరియంట్ల నేపథ్యంలో మూడో డోస్ అవసరమవుతుందో లేదో అధ్యయంన చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాగా.. ప్రస్తుతం ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను 150కిపైగా దేశాల్లో వినియోగిస్తున్నారు.
Also read: