కరోనా మహమ్మారితో భారత జవాన్లు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే సీఆర్పీఎఫ్, ఆర్మీ, సీఐఎస్‌ఎఫ్ వంటి సంస్థల్లో అనేక మంది జవాన్లు కరోనా బారినపడ్డారు. తాజాగా సోమవారం నాడు మరో 21 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు కరోనా సోకింది. గడిచిన 24 గంటల్లో 21 మంది సిబ్బందికి కరోనా సోకగా.. మరో 18 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 305 మంది బీఎస్ఎఫ్ జవాన్లు పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని.. ఇప్పటికే కరోనా నుంచి 655 మంది కోలుకున్నారని తెలిపారు.
ఇక దేశ వ్యాప్తంగా కూడా కరోన కేసుల సంఖ్య పెరుగుతోంది. సోమవారం నాటికి దేశ వ్యాప్తంగా 5,48,318 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో ప్రస్తుతం 2,10,120 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. మరో 3,21,723 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ఇక ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 16వేల మందికి పైగా కరోనా బారినపడి మరణించారు.