హైదరాబాద్, సెప్టెంబర్ 3: వారం రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వరుస వర్షాల కారణంగా టీజీ పీజీఈసెట్ -2024 ప్రవేశాలకు అంతరాయం కలిగింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 2వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు నమోదు ప్రక్రియ ప్రారంభంకావల్సి ఉంది. వర్షాలు, వరదల నేపథ్యంలో ఆ ప్రక్రియ సెప్టెంబర్ 4వ తేదీకి వాయిదా పడింది. ఇప్పటికే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయింది. వెబ్ ఆప్షన్లకు అర్హులైన అభ్యర్థుల జాబితాను కూడా అధికారులు విడుదల చేశారు. వరదల కారణంగా తమ ఇళ్లలో విద్యుత్తు లేదని, ఇంటర్‌నెట్ కేంద్రాలు కూడా పనిచేయడం లేదని పలువురు అభ్యర్ధులు వాపోయారు. దీంతో పీజీఈసెట్ వెబ్‌ఆప్షన్ల ప్రక్రియను కొద్ది రోజులు వాయిదా వేయాలని ఫోన్లు, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ప్రవేశాల కన్వీనర్ రమేష్‌బాబుకు విజ్ఞప్తులు చేయసాగారు. మరోవైపు పలు జిల్లాలో వరద పరిస్థితిని అంచనా వేసిన ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్ లింబాద్రి.. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున పీజీఈసెట్‌ను కొద్దిరోజులు వాయిదా వేయాలని ప్రవేశాల కన్వీనర్ పిరమేష్‌బాబును ఆదేశించారు.
దీంతో తాజాగా వెబ్ ఆప్షన్లకు సంబంధించిన ప్రక్రియను అధికారులు రీషెడ్యూల్ చేశారు. సెప్టెంబర్ 4, 5 తేదీల్లో ఫేజ్-1కు సంబంధించి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 6వ తేదీన వెబ్ ఆప్షన్ల ఎడిట్‌కు అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 9వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. ఫస్ట్ ఫేజ్‌లో సీట్లు పొందిన అభ్యర్థులు 10 నుంచి 13వ తేదీ లోపు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్10వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని పలు యూనివర్సిటీలు, కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా కౌన్సెలింగ్ ప్రక్రియ చేపడుతున్నారు. ఇప్పటికే తొలి విడత పూర్తికాగా రెండో విడత కౌన్సెలింగ్‌ను సెప్టెంబరు 4 నుంచి ప్రారంభించనున్నట్లు కన్వీనర్ ఉమామహేశ్వరి తెలిపారు. సెప్టెంబర్ 4 నుంచి 7వ తేదీ వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు, 5 నుంచి 8 వరకు ధ్రువపత్రాల పరిశీలన, 9 నుంచి 14 వరకు కోర్సులు, కాలేజీల ఎంపికకు వెబ్ ఐచ్ఛికాల నమోదు , 15వ తేదీన ఐచ్ఛికాల మార్పునకు అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 17న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 21లోపు కాలేజీల్లో ప్రవేశాలు పొందవల్సి ఉంటుంది.