
UPSC Civil services final result 2024 : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC 2024).. అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం నిర్వహించిన సివిల్ సర్వీసెస్ 2024 పరీక్ష తుది ఫలితాలను ప్రకటించింది. ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం (ఏప్రిల్ 22) మధ్యాహ్నం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో పలు రాష్ట్రాలకు చెందిన వారితోపాటు.. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటారు. శక్తి దూబే అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంకు సాధించి అగ్రస్థానంలో నిలిచారు.. అభ్యర్థులు ఫలితాలను తెలుసుకునేందుకు.. UPSC అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in ని సందర్శించండి.. ఇక్కడ రోల్ నంబర్, పేరు ఎంటర్ చేయడం ద్వారా తమ ఫలితాలను తనిఖీ చేయవచ్చు. ఇంటర్వ్యూ, ప్రధాన పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ తుది ఫలితాలను ప్రకటించారు.
కమిషన్ మొత్తం 1009 మంది అభ్యర్థులను సిఫార్సు చేసింది.. ఇందులో జనరల్ కేటగిరీ నుండి 335 మంది, EWS నుండి 109 మంది, OBC నుండి 318 మంది, SC నుండి 160 మంది, ST కేటగిరీ నుంచి 87 మంది ఉన్నారు. IAS కి 180 మంది, IFS (ఇండియన్ ఫారిన్ సర్వీసెస్)కు 55 మంది, IPS కు 147 మంది ఎంపిక చేశారు.
యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు సత్తా చాటారు. వీరిలో.. ఇ.సాయి శివాని 11వ ర్యాంకు, బన్నా వెంకటేశ్‌కు 15వ ర్యాంకు, అభిషేక్ శర్మ 38, రావుల జయసింహారెడ్డి 46, శ్రవణ్‌కుమార్ రెడ్డి 62, సాయి చైతన్య జాదవ్ 68, ఎన్ చేతనరెడ్డి 110, చెన్నంరెడ్డి శివగణేష్ రెడ్డి 119, చల్లా పవన్ కల్యాణ్ 146, ఎన్.శ్రీకాంత్ రెడ్డి 151, నెల్లూరు సాయితేజ 154, కొలిపాక శ్రీకృష్ణసాయి 190వ ర్యాంకులు సాధించారు.
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో మొత్తం 1056 ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి పోస్టుల భర్తీకి 2024 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చింది. జూన్ 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా.. ఇందులో అర్హత సాధించిన వారికి యూపీఎస్సీ అదే ఏడాది..సెప్టెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించింది. అనంతరం మెయిన్స్‌లో సత్తా చాటిన వారికి.. ఇంటర్వ్యూలు 7 జనవరి 2025 నుండి 17 ఏప్రిల్ 2025 వరకు కొనసాగాయి.. ఇంటర్వ్యూలో మొత్తం 2845 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. ఎంపికైన అభ్యర్థులలో.. UPSC 241 మంది అభ్యర్థుల అభ్యర్థిత్వాన్ని తదుపరి ధృవీకరణ వరకు తాత్కాలికంగా ఉంచింది.
కాగా.. సివిల్స్‌లో అభ్యర్థులు సాధించిన మార్కుల జాబితాను 15 రోజుల్లోగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు యూపీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.