హైదరాబాద్, ఆగస్టు 17: తెలంగాణ భూగర్భజల శాఖలోని వివిధ గెజిటెడ్, నాన్‌గెజిటెడ్ పోస్టుల భర్తీకి జులై 20, 21 తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ టీఎస్‌పీఎస్సీ తాజాగా విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థుల సమాధానాల పత్రాలను కూడా కమిషన్ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ప్రాథమిక ఆన్సర్ కీపై ఏవైనా అభ్యంతరాలుంటే ఆగస్టు 19, 20, 21 తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో నమోదు చేయాలని అభ్యర్ధులకు సూచించింది.
2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షకు దరఖాస్తు గడువు మరోమారు పొడిగించారు. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు ఆన్‌లైన్ దరఖాస్తు గడువు ఆగస్టు 17తో గడువు ముగియనుంది. దీంతో దరఖాస్తు గడువు ఆగస్టు 25 వరకు పొడిగిస్తున్నట్లు వేలేరు నవోదయ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు ఆగస్టు 16న వెల్లడించారు. ఇప్పటి వరకు అప్లై చేసుకోని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవల్సిందిగా విద్యార్ధులకు సూచించారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలని ఆయన తెలిపారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు ఏవైనా పొరపాటుగా నమోదు చేసి ఉంటే ఆగస్టు 26, 27 తేదీల్లో సవరించుకోవచ్చని వివరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న రాత పరీక్ష ప్రశ్నాపత్రం ఇంగ్లిష్‌తోపాటు తెలుగు మాధ్యమంలోనూ ఉంటుందని ఏపీపీఎస్సీ ప్రకటించింది. గతేడాది సెప్టెంబరు 30న జారీ చేసిన ఈ పోస్టుల నోటిఫికేషన్‌కు ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణ ఇప్పటికే పూర్తయింది. అయితే అర్హతలు కలిగిన వారికి దరఖాస్తు చేసుకోవడానికి మరో అవకాశం కల్పించింది. ఈ మేరకు ఆగస్టు 21 నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఓ ప్రకటనలో కమిషన్ వెల్లడించింది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.